బంగారంతో సీక్రెట్ గేమ్.. ఆగస్టులో 20 టన్నులు కొనుగోలు.. చైనాలో ఏం జరుగుతోంది అసలు..
అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు గరిష్ట స్థాయిల్లో కొనసాగుతున్నప్పటికీ.. చైనా మాత్రం పసిడి కొనుగోళ్లను ఏమాత్రం తగ్గించడం లేదు. దేశ కేంద్ర బ్యాంకు అయిన పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా (PBOC), ఆగస్టు 2026లో తన అధికారిక నిల్వలకు ఏకంగా 20.2 టన్నుల బంగారాన్ని యాడ్ చేసింది. ఇది అక్టోబర్ 2023 తర్వాత ఒకే నెలలో చైనా జరిపిన అతిపెద్ద కొనుగోలుగా రికార్డులకెక్కింది. అధికారిక సమాచారం ప్రకారం, ఆగస్టు నెలలో చైనా Gold నిల్వలు 6,50,000 ఫైన్ ట్రాయ్ ఔన్సులు పెరిగి, జూలై నాటి 76.08 మిలియన్ ఔన్సుల నుండి రికార్డు స్థాయిలో 76.73 మిలియన్ ఔన్సులకు చేరుకున్నాయి.
టన్నుల పరంగా చూస్తే.. చైనా వద్ద ప్రస్తుతం సుమారు 2,387 టన్నుల భారీ Gold నిల్వలు ఉన్నాయి. గత మూడు నెలలుగా చైనా కొనుగోళ్లను వేగవంతం చేస్తూ జూన్‌లో 15 టన్నులు, జూలైలో 20 టన్నులు, ఆగస్టులో 20.2 టన్నుల చొప్పున మొత్తం 55 టన్నులను తన ఖాతాలో వేసుకుంది. ఇక 2026 నాటి మొదటి ఎనిమిది నెలల్లోనే చైనా సుమారు 80 టన్నులు కొనుగోలు చేయగా, 2025 లెక్కింపుల ప్రకారం ఆ ఏడాది మొత్తం కొనుగోలు చేసిన 29 టన్నులతో పోలిస్తే ఇది దాదాపు మూడు రెట్లు ఎక్కువ కావడం గమనార్హం. ఆగస్టు నాటికి వరుసగా 22వ నెల కూడా పసిడి నిల్వలను పెంచుకోవడం ద్వారా చైనా చరిత్రలోనే అత్యంత సుదీర్ఘమైన కొనుగోళ్ల కాలాన్ని నమోదు చేసింది.

చైనా ఈ స్థాయిలో బంగారం వైపు మొగ్గు చూపడానికి బలమైన వ్యూహాత్మక, భౌగోళిక రాజకీయ కారణాలు ఉన్నాయి. తమ విదేశీ మారక ద్రవ్య నిల్వల కోసం కేవలం అమెరికన్ డాలర్, యుఎస్ ట్రెజరీ బాండ్లపై మాత్రమే ఆధారపడకుండా, నిధులను సురక్షితమైన ఆస్తులలోకి వైవిధ్యపరచాలని చైనా భావిస్తోంది. బంగారం అనేది ఏ ఒక్క నిర్దిష్ట దేశానికి లేదా సంస్థకు బాధ్యత కాకపోవడం, అలాగే ఏ ప్రభుత్వం మారినా లేదా కంపెనీ దివాలా తీసినా దీనిపై డిఫాల్ట్ అయ్యే ప్రమాదం లేకపోవడం దీని ప్రధాన ప్లస్ పాయింట్.
పెరుగుతున్న అమెరికా ప్రభుత్వ అప్పులు, అంతర్జాతీయ ఆంక్షల ముప్పు, ప్రపంచవ్యాప్తంగా తలెత్తుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో చైనా తన ఆర్థిక భద్రతను బలోపేతం చేసుకోవడానికే ఈ చర్యలు చేపడుతోంది. అంతేకాకుండా, సుదీర్ఘ కాలంలో తమ స్వదేశీ కరెన్సీ అయిన రెన్మిన్బీకి ప్రపంచ మార్కెట్‌లో మరింత అంతర్జాతీయ గుర్తింపు, స్థిరత్వం తీసుకురావడానికి పసిడి నిల్వలు ఎంతగానో తోడ్పడతాయి. అయితే ఈ అధికారిక గణాంకాలు చైనా వెల్లడించిన లెక్కలు మాత్రమేనని.. మార్కెట్ విశ్లేషకుల అంచనాల ప్రకారం వారి వాస్తవ కొనుగోళ్లు ఈ బహిరంగ నివేదికల కంటే చాలా ఎక్కువగా ఉండే అవకాశముందని భావిస్తున్నారు.
ప్రపంచంలోని ప్రధాన కేంద్ర బ్యాంకులు ఈ రీతిలో నిరంతరంగా కొనుగోళ్లు జరపడం అనేది బంగారంపై పెట్టుబడులు పెట్టేవారికి సుదీర్ఘ కాలంలో ఒక సానుకూల సంకేతంగా నిలుస్తుంది. ధరలు ఎంత పెరిగినప్పటికీ సంక్షోభ సమయాల్లో ఉపయోగపడే అత్యంత సురక్షితమైన వ్యూహాత్మక ఆస్తిగా బంగారమే నిలుస్తుందని ఇది నిరూపిస్తోంది. అయినప్పటికీ.. దీని ఆధారంగా బంగారం ధరలు రోజువారీగా పెరుగుతాయని భావించలేము. స్వల్పకాలంలో అమెరికా డాలర్ కదలికలు, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల నిర్ణయాలు, బాండ్ దిగుబడుల మార్పులు మరియు పెట్టుబడిదారులు జరిపే లాభాల స్వీకరణ వంటి అంశాల వల్ల ధరల్లో హెచ్చుతగ్గులు, తగ్గుదలలు సహజంగానే తలెత్తుతాయని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
