ఇరాన్ యుద్ధాన్ని బంగారంపై అస్త్రంగా వాడుకుంటున్న చైనా.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పునాదులపై భారీ స్కెచ్..
ప్రపంచ దేశాలు యుద్ధ మేఘాలు.. క్షిపణి దాడులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలతో అట్టుడుకుతున్న వేళ, చైనా మాత్రం అత్యంత వ్యూహాత్మకంగా, నిశ్శబ్దంగా తన ఆర్థిక పునాదులను పటిష్టం చేసుకుంటోంది. దీనికోసం ఆ దేశం ఎంచుకున్న ప్రధాన మార్గం 'బంగారం'. పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా (PBOC) వరుసగా 16 నెలల పాటు విరామం లేకుండా బంగారు నిల్వలను పెంచుకుంటూ పోవడం కేవలం ఒక పెట్టుబడి చర్య మాత్రమే కాదు.
అది అమెరికా డాలర్ ఆధిపత్యానికి వ్యతిరేకంగా సిద్ధం చేసుకుంటున్న ఒక శక్తివంతమైన 'బీమా పాలసీ' అని విశ్లేషకులు భావిస్తున్నారు. 2026 మార్చి నాటికి అందిన గణాంకాల ప్రకారం, చైనా అధికారిక బంగారు నిల్వలు 2,309 టన్నులకు చేరుకున్నాయి. వీటి విలువ సుమారు 387.6 బిలియన్ డాలర్లు. గత 20 నెలల్లోనే చైనా విదేశీ మారక నిల్వల్లో బంగారం వాటా రెట్టింపు కావడం ఆ దేశం యొక్క సుదీర్ఘ లక్ష్యాలను స్పష్టం చేస్తోంది.

అయితే, అధికారికంగా కనిపిస్తున్న ఈ 2,309 టన్నులు కేవలం మంచుకొండ కొన మాత్రమేనని.. అసలు కథ అంతకంటే చాలా లోతుగా ఉందని ప్రపంచ ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. షాంఘై గోల్డ్ ఎక్స్ఛేంజ్ ద్వారా జరుగుతున్న లావాదేవీలు, హాంగ్ కాంగ్ దిగుమతులు, రష్యాతో నేరుగా చేసుకుంటున్న ఒప్పందాలు, ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా సేకరిస్తున్న బంగారాన్ని లెక్కలోకి తీసుకుంటే.. చైనా వాస్తవ నిల్వలు అధికారిక గణాంకాల కంటే రెండు నుండి పది రెట్లు ఎక్కువగా ఉండవచ్చు.
చైనా తన Gold సేకరణ వ్యవస్థను ఎంత తెలివిగా రూపొందించిందంటే, షాంఘై గోల్డ్ ఎక్స్ఛేంజ్‌లో కొనుగోలు చేసిన బంగారాన్ని భౌతికంగా తప్పనిసరిగా తీసుకోవాలి. ఒకసారి బంగారం ఆ ఖజానా నుండి బయటకు వెళ్తే, అది ట్రాకింగ్ వ్యవస్థ నుండి పూర్తిగా మాయమైపోతుంది. తద్వారా ఆ నిల్వలు ఎక్కడున్నాయో ఎవరికీ తెలియకుండా పోతుంది.
చైనా అనుసరిస్తున్న ఈ వ్యూహంలో కేవలం Gold మాత్రమే లేదు. అది చమురు, ఎరువులు, సైనిక శక్తిని కూడా ఒకేసారి బలోపేతం చేసుకుంటోంది. ప్రపంచ మార్కెట్లో చౌకగా లభించే చమురును నిల్వ చేయడం, ఎరువుల ఎగుమతులపై ఆంక్షలు విధించడం ద్వారా ఇతర దేశాల వ్యవసాయ రంగాన్ని ప్రభావితం చేయడం వంటి చర్యలు ఇందులో భాగమే. భవిష్యత్తులో అమెరికా డాలర్ బలహీనపడినా లేదా అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో ఆకస్మిక మార్పులు సంభవించినా, ఏ దేశం కూడా స్తంభింపజేయలేని 'బంగారు కవచాన్ని' చైనా నిర్మించుకుంటోంది. ఈ నిల్వలను తరలించడానికి సముద్ర మార్గాలు లేదా పైప్‌లైన్లపై ఆధారపడాల్సిన అవసరం లేకపోవడం చైనాకు అదనపు బలాన్ని ఇస్తోంది.
ప్రస్తుతం మార్కెట్‌లో ఒక వింత ధోరణి కనిపిస్తోంది. సాధారణ పెట్టుబడిదారులు కాగితపు బంగారం (Gold ETFs) వైపు మొగ్గు చూపుతుంటే, చైనా వంటి అగ్రరాజ్యాలు మాత్రం భౌతిక బంగారాన్ని తమ ఖజానాల్లో నింపుకుంటున్నాయి. ఇది కాగితపు రూపంలోని విలువకు మరియు వాస్తవ ఆస్తికి మధ్య ఉన్న అంతరాన్ని పెంచుతోంది. చైనా కేవలం బంగారం కొనుగోలుదారుగా మాత్రమే కాకుండా, ఫ్యూచర్స్ మార్కెట్లో ఆర్థిక శక్తిని శాసించే స్థాయికి చేరుకుంటోంది. ఈ రహస్య నిల్వలు, అధికారిక సేకరణలు చూస్తుంటే, రాబోయే పదేళ్లలో ప్రపంచ ఆర్థిక సమతుల్యత పూర్తిగా మారిపోయే అవకాశం ఉందని స్పష్టమవుతోంది. అమెరికా డాలర్‌కు ప్రత్యామ్నాయంగా ఒక కొత్త వ్యవస్థను నిర్మించడంలో చైనా వేస్తున్న ఈ అడుగులు ప్రపంచ ఆర్థిక క్రమాన్ని తిరగరాసేలా ఉన్నాయి.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications