ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో బంగారం కేవలం ఒక విలువైన లోహంగానే కాకుండా, దేశాల ఆర్థిక పటిష్టతకు కొలమానంగా నిలుస్తోంది. ఇటీవల కాలంలో బంగారం ధరలు అంతర్జాతీయంగా అనేక ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. ఈ ఏడాది జనవరిలో బంగారం ధరలు మునుపెన్నడూ లేని విధంగా సర్వకాలిక గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. అయితే, పశ్చిమ ఆసియాలో ఇరాన్ యుద్ధం వంటి భౌగోళిక రాజకీయ పరిణామాలు తలెత్తిన తర్వాత, మార్కెట్ సమీకరణాలు మారి ధరలు కొంతమేర తగ్గుముఖం పట్టాయి.
ప్రధానంగా అమెరికా డాలర్ బలోపేతం కావడం, అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితి వల్ల పెట్టుబడిదారులు తమ వ్యూహాలను మార్చుకోవడంతో, ఈ ధరల పతనం చోటుచేసుకుంది. దేశీయంగా మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లో (MCX) కూడా ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ట్రేడింగ్ సమయంలో జూన్ నెల డెలివరీకి సంబంధించిన Gold ధరలు భారీగా పడిపోయి, ప్రస్తుతం రూ.1,53,445 స్థాయి వద్ద కొనసాగుతున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా బంగారానికి ఉన్న డిమాండ్‌ను విశ్లేషిస్తే.. అభివృద్ధి చెందుతున్న వర్ధమాన మార్కెట్లు కీలక పాత్ర పోషిస్తున్నాయని అర్థమవుతోంది. గత దశాబ్ద కాలంగా ప్రపంచ డిమాండ్‌లో దాదాపు 70 శాతం వాటా ఈ మార్కెట్ల నుండే వస్తోంది. ఇందులో ఆసియా ఖండంలోని రెండు అగ్ర దేశాలైన చైనా, భారతదేశాల వాటా అత్యంత కీలకం. చైనా 27 శాతంతో ప్రపంచంలోనే అతిపెద్ద డిమాండ్ కలిగిన దేశంగా ప్రథమ స్థానంలో నిలవగా, భారతదేశం 21 శాతంతో రెండవ స్థానంలో ఉంది.
అంటే ప్రపంచం మొత్తం మీద బంగారానికి ఉన్న డిమాండ్‌లో సగం వాటా కేవలం ఈ రెండు దేశాలదే కావడం విశేషం. మిగిలిన ప్రాంతాలను గమనిస్తే ఉత్తర అమెరికా వాటా 11 శాతంగా, యూరప్ (రష్యాతో కలిపి) 12 శాతంగా ఉన్నాయి. మధ్యప్రాచ్యం, ఆగ్నేయాసియా దేశాలు కూడా తమ వంతు వాటాతో మార్కెట్‌ను ప్రభావితం చేస్తున్నాయి. ఈ డిమాండ్‌లో కేవలం ఆభరణాలే కాకుండా, పెట్టుబడిగా భావించే బంగారు కడ్డీలు, నాణేలు, ఈటీఎఫ్‌లు, టెక్నాలజీ రంగంలో ఉపయోగించే బంగారం కూడా కలిసి ఉన్నాయి.
ఇక సరఫరా, ఉత్పత్తి విషయానికి వస్తే.. ప్రపంచ బంగారు లభ్యత ప్రధానంగా గనుల తవ్వకం, రీసైక్లింగ్ ద్వారా జరుగుతోంది. మొత్తం సరఫరాలో 74 శాతం వాటా గనుల ఉత్పత్తి నుండి వస్తుండగా, పాత బంగారాన్ని రీసైకిల్ చేయడం ద్వారా 26 శాతం అవసరాలు తీరుతున్నాయి. ప్రాంతాల వారీగా చూస్తే ఆఫ్రికా ఖండం 26 శాతం సరఫరాతో ప్రపంచంలోనే అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆసియా ఖండం 19 శాతంతో రెండవ స్థానంలో ఉండగా.. పూర్వపు సోవియట్ యూనియన్ దేశాలు, అమెరికా ఖండాలు కూడా గణనీయమైన వాటాను కలిగి ఉన్నాయి.
ఉత్పత్తి పరంగా దేశాల వారీగా విశ్లేషిస్తే, చైనా ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు ఉత్పత్తిదారుగా తన ఆధిపత్యాన్ని చాటుతోంది. చైనా తర్వాత రష్యా, ఆస్ట్రేలియా, కెనడా, అమెరికా వంటి దేశాలు ప్రధాన ఉత్పత్తిదారులుగా ఉన్నాయి. ఈ విధంగా ప్రపంచవ్యాప్తంగా సరఫరా, డిమాండ్ మధ్య ఉన్న ఈ సంక్లిష్టమైన సమతుల్యత, ప్రస్తుతం నెలకొన్న యుద్ధ వాతావరణం, మారుతున్న అంతర్జాతీయ ఆర్థిక విధానాల వల్ల ఎప్పటికప్పుడు మారుతూ, బంగారం ధరలను ప్రభావితం చేస్తోంది.


Click it and Unblock the Notifications
