Futures & Options Trading: ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్ వైపు స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్టర్ల నుంచి ఆదరణ రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ఈ ట్రేడింగ్‌లో అధిక రిస్క్ ఉన్నప్పటికీ చాలా మంది పెట్టుబడిదారులు తమ పొదుపు సొమ్మును ఇందులో పెడుతున్నారు. అందుబాటులో ఉన్న డేటా ప్రకారం ప్రతి 10 మంది ఆప్షన్ ట్రేడర్లలో 9 మంది నష్టపోతున్నారని సెబీ డేటా ప్రకారం వెల్లడైంది. దీంతో పెట్టుబడిదారులను ప్రభుత్వం నిరంతరం హెచ్చరిస్తూనే ఉంది.
ఇటీవల ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఒక కార్యక్రమంలో ఆప్షన్స్ ట్రేడింగ్ గురించి ప్రజలను హెచ్చరించారు. తాజాగా ప్రధాన ఆర్థిక సలహాదారు చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్(CEA) V అనంత్ నాగేశ్వరన్ కూడా ప్రజలు తమ పొదుపు డబ్బును వీటిలో పెట్టుబడిగా పెట్టకుండా ఉండాలని సూచించారు.

ఎప్పుడైతే దేశాభివృద్ధికి ముందు ఆర్థిక రంగం అభివృద్ధి చెందిందో, అటువంటి దేశాలకు ఫలితాలు మంచిగా లేవని నాగేశ్వరన్ వెల్లడించారు. 1997-98 నాటి ఆసియా సంక్షోభం దీనికి చాలా ముఖ్యమైన ఉదాహరణగా పేర్కొన్నారు. అలాగే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్‌లో మనం ప్రపంచంలోనే అతిపెద్ద ట్రేడింగ్ వాల్యూమ్‌ను కలిగి ఉన్నందుకు గర్విస్తున్నప్పటికీ.. ఇది పురోగతికి సంకేతమా లేదా ఆందోళన కలిగించే విషయమా అని మనం ప్రశ్నించుకోవాలన్నారు.
భారతీయ దేశీయ పొదుపులను ఉత్పాదక ప్రయోజనాల కోసం మనం వినియోగించుకోగల రంగాల్లో మూలధన మార్కెట్లు వృద్ధి చెందేలా ఆర్థిక రంగం నిర్ధారించుకోవాలని ప్రధాన ఆర్థిక సలహాదారు చెప్పారు. అలాగే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్ విభాగంలో రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి ఎటువంటి హద్దులేని బూమ్ పెట్టుబడిదారుల మనోభావాలకు, కుటుంబ స్థాయిలో పొదుపుకు సమస్యలను సృష్టిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు.
తాజా ప్రభుత్వ గణాంకాల ప్రకారం దేశంలో నికర పొదుపులు మూడేళ్లలో రూ.9 లక్షల కోట్లు తగ్గి 2022-23 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి రూ.14.16 లక్షల కోట్లకు చేరుకున్నాయని వెల్లడైంది. అయితే ఈ కాలంలో స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు వేగంగా పెరిగాయి. ప్రధానంగా ప్రజలు మార్కెట్లో అందుబాటులో ఉన్న రుణాలను తీసుకుంటూ వేగంగా తమ అవసరాలను తీర్చుకుంటున్నారు. ఇది దేశంలోని ప్రజల్లో డబ్బు దాచుకునే ధోరణిని భారీగా తగ్గిస్తోంది.


Click it and Unblock the Notifications