Gas booking: ఫోన్ కొడితే చాలు.. మీ ఇంటి ముందుకు మినీ గ్యాస్ సిలిండర్!
కొత్త ఆర్థిక సంవత్సరం ఆరంభంలోనే సామాన్యుడికి గ్యాస్ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. ఏప్రిల్ 1, 2026 నుంచి అమల్లోకి వచ్చేలా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఎల్‌పిజి (LPG) సిలిండర్ల ధరలను భారీగా పెంచాయి. ముఖ్యంగా పేదలు, విద్యార్థులు ఎక్కువగా వాడే 5 కేజీల 'ఛోటు' సిలిండర్ ధర ఈసారి గణనీయంగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది.

ఎందుకు పెరిగాయి ఈ ధరలు?
ప్రస్తుతం మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో (ముఖ్యంగా అమెరికా, ఇజ్రాయెల్ , ఇరాన్ మధ్య) నెలకొన్న ఉద్రిక్తతల వల్ల చమురు దిగుమతులు నిలిచిపోయాయి. హార్ముజ్ జలసంధి (Strait of Hormuz) గుండా గ్యాస్ దిగుమతులు జరగకపోవడం వల్ల సరఫరాలో కొరత ఏర్పడింది. భారత్ దిగుమతి చేసుకునే ఎల్‌పిజిలో దాదాపు 88 శాతం ఈ మార్గం గుండానే వస్తుంది. ఈ కారణం చేతనే ధరలు పెంచాల్సి వచ్చిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
పెరిగిన ధరల వివరాలు (April 2026)
- 5 కేజీల ఛోటు సిలిండర్: దీనిపై ఏకంగా రూ. 51 పెరిగింది. గతంలో ఇది సుమారు రూ. 649 ఉండగా, ఇప్పుడు రూ. 700 మార్కును చేరుకుంది.
- 19 కేజీల కమర్షియల్ సిలిండర్: దీని ధర రూ. 195.50 నుండి రూ. 218 వరకు పెరిగింది. కోల్‌కతాలో అత్యధికంగా రూ. 218 పెరగగా, ఢిల్లీలో రూ. 195.5 పెరిగింది.
ఛోటు, అప్పు, మినీ గ్యాస్.. వీటి ప్రత్యేకత ఏంటి?
మనం ఇంట్లో వాడే 14.2 కేజీల సిలిండర్లలా కాకుండా, ఈ 5 కేజీల సిలిండర్ల కోసం ఎలాంటి అడ్రస్ ప్రూఫ్ అవసరం లేదు. కేవలం ఒక గుర్తింపు కార్డు (POI) ఉంటే చాలు. అందుకే బ్యాచిలర్స్, వలస కార్మికులు, విద్యార్థులు వీటిని ఎక్కువగా ఇష్టపడతారు.
గ్యాస్ బుకింగ్ (Gas booking) చేసుకోవడం ఎలా?
వివిధ కంపెనీల 5 కేజీల సిలిండర్లను ఎలా పొందాలో ఇక్కడ చూడండి..
- ఇండియన్ ఆయిల్ (Indane Chhotu/Munna): మీకు దగ్గరలోని ఇండేన్ డిస్ట్రిబ్యూటర్ లేదా వారి సేల్స్ పాయింట్స్ (కిరాణా స్టోర్స్, పెట్రోల్ బంకులు) వద్ద ఇది దొరుకుతుంది. అడ్రస్ ప్రూఫ్ అక్కర్లేదు, కేవలం ఐడీ కార్డు ఇస్తే చాలు.
- హెచ్‌పి గ్యాస్ (HP Appu): హెచ్‌పి గ్యాస్ ఏజెన్సీలు, ఎంపిక చేసిన కిరాణా షాపులు , పెట్రోల్ బంకుల్లో 'అప్పు' గ్యాస్ అందుబాటులో ఉంటుంది. మొదటిసారి కొనేటప్పుడు సిలిండర్ , రెగ్యులేటర్ ధర కలిపి చెల్లించాలి, ఆ తర్వాత కేవలం గ్యాస్ రీఫిల్ ధర చెల్లిస్తే సరిపోతుంది.
- భారత్ గ్యాస్ (BharatGas Mini): దీని కోసం మీరు ఇంటి నుంచే బుక్ చేసుకోవచ్చు. 'డయల్ ఏ భారత్ గ్యాస్ మినీ' సేవ ద్వారా టోల్ ఫ్రీ నంబర్ 1800 22 4344 కి కాల్ చేస్తే రెండు గంటల్లో ఇంటికి డెలివరీ ఇస్తారు. హైదరాబాద్‌తో సహా ప్రధాన నగరాల్లో ఈ సౌకర్యం ఉంది.
ఏదేమైనా ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితుల వల్ల గ్యాస్ కొరత ఏర్పడటంతో, సామాన్యులు త్వరగా అందుబాటులో ఉండే ఈ మినీ సిలిండర్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ధరలు పెరిగినప్పటికీ, వీటి లభ్యత సులభంగా ఉండటం కొంత ఊరటనిచ్చే అంశం.


Click it and Unblock the Notifications