చెన్నై: కార్పొరేట్ రంగాన్ని షేక్ చేసిన లక్ష కోట్ల రూపాయల కుంభకోణంలో అరెస్టుల పర్వానికి తెర తీసినట్టు కనిపిస్తోంది. ఈ కుంభకోణంలో కింగ్‌పిన్‌గా ఆరోపణలను ఎదుర్కొంటోన్న ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (IL&FS) మాజీ అధినేత, బిగ్‌షాట్ రవి పార్థసారథి అరెస్ట్ అయ్యారు. చెన్నై పోలీసు విభాగానికి చెందిన ఆర్థిక నేరాల నియంత్రణ విభాగం అధికారులు ఆయన చేతికి బేడీలు వేశారు. ఐఎల్ అండ్ ఎఫ్ఎస్‌లో చోటు చేసుకున్నట్లుగా అనుమానిస్తోన్న లక్ష కోట్ల రూపాయల విలువ గల కుంభకోణానికి రవి పార్థసారథే ప్రధాన సూత్రధారిగా భావిస్తున్నారు.
ముంబై ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలను సాగిస్తోన్న 63 మూన్స్ టెక్నాలజీస్ అనే కంపెనీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రవి పార్థసారథిని అరెస్ట్ చేశారు. ఆయనను న్యాయస్థానం ముందు హాజరు పరిచారు. ఆయనను 15 రోజుల పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ న్యాయస్థానం ఆదేశాలను జారీ చేసింది. దీనికి సంబంధించిన తదుపరి విచారణ ఈ నెల 14వ తేదీకి వాయిదా వేసింది. ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ గ్రూప్‌లోని సుమారు 350 కంపెనీలకు అధినేతగా ఉన్న సమయంలో రవి పార్థసారథి మోసాలకు పాల్పడినట్లు 63 మూన్స్ టెక్నాలజీస్ ఫిర్యాదు ఇచ్చిందని, దీనికి అనుగుణంగా ఆయనను అరెస్ట్ చేసినట్లు చెన్నై పోలీస్ ఆర్థిక నేరాల విభాగం డీఎస్పీ ప్రకాష్ బాబు తెలిపారు.

ఈ మోసాల వ్యవహారంలో తాము 200 కోట్ల రూపాయల మేర నష్టపోయినట్లు 63 మూన్స్ టెక్నాలజీస్ ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. అలాగే పలువురు ఇన్వెస్టర్ల నుంచి కూడా ఫిర్యాదులు అందాయని పేర్కొన్నారు. తనను అరెస్ట్ చేయకుండా ఉండటానికి రవి పార్థసారథి ఇదివరకే మద్రాస్ హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటీషన్‌ను దాఖలు చేయగా.. న్యాయస్థానం దాన్ని కొట్టివేసింది. తాజాగా ఆయనను అరెస్ట్ చేసిన న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టారు.

2018లో తొలిసారిగా ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ గ్రూప్‌లో 30 సంవత్సరాలుగా రవి పార్థసారథి పనిచేశారు. అనేక కీలక హోదాలకు ప్రాతినిథ్యాన్ని వహించారు. కుంభకోణం చోటు చేసుకున్నట్లు తొలిసారిగా వెలుగులోకి వచ్చిన 2018లోనే ఆయన ఆ సంస్థను వదిలేశారు. ఆయన హయాంలోనే ఇంత భారీ కుంభకోణం చోటు చేసుకుని ఉంటుందనే అనుమానాలు ఇన్నాళ్లూ వ్యక్తమయ్యాయి. దీన్ని మరింత బలం కలిగించేలా ఆయన అరెస్ట్ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ కుంభకోణం విలువ లక్ష నుంచి లక్షా 15 వేల కోట్ల రూపాయల మేర ఉండొచ్చని అంచనా వేస్తోన్నట్లు డీఎస్పీ ప్రకాష్ బాబు చెప్పారు.


Click it and Unblock the Notifications