పెరుంగుడి చెత్త నేర్పిన పాఠం.. తెలుగు రాష్ట్రాలు నేర్చుకోవాల్సింది చాలానే ఉంది.
దాదాపు 50 సంవత్సరాలుగా చెన్నైలోని పెరుంగుడి ప్రాంతం చెత్తతో నిండిపోయి నగరాన్ని మురికవాడగా మార్చివేసింది. దాదాపు 96 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ డంప్‌యార్డ్ నగర వ్యర్థాల సమస్యకు ఒక ప్రతీకగా నిలిచింది. 20 ఫుట్‌బాల్ మైదానాలకు సరిపడేంత చెత్త ఇక్కడ పేరుకుపోయి.. కాలుష్యానికి, దుర్వాసనలకు, ప్రజల ఆరోగ్య సమస్యలకు కారణమైంది. అయితే Perungudi చెత్త మైదానం ఇప్పుడు భారతదేశంలోని చాలా రాష్ట్రాలకు ఆదర్శవంతంగా నిలిచింది.
ఇది ఎలా సాధ్యమైంది: బ్లూ ప్లానెట్ ఎన్విరాన్‌మెంటల్ సొల్యూషన్స్ అనే సంస్థ బయోమైనింగ్ టెక్నాలజీతో ఈ ప్రాంతాన్ని పూర్తిగా శుభ్రం చేసింది. ఈ టెక్నాలజీ వల్ల ఒక్క చెత్త ముక్క కూడా వృధా కాలేదు. రోజుకు సుమారు 9 వేల టన్నుల వ్యర్థాలను వేరు చేసి, శుద్ధి చేసి, కొత్త ఉత్పత్తులుగా మార్చారు. శుభ్రపరిచే ప్రతి దశలో 52 భద్రతా తనిఖీలు జరగడం వల్ల కాలుష్యం అక్కడ సున్నా శాతమే జరిగింది.ఈ చెత్త అంతా ఉక్కు పాత్రలతో పాటుగా హర్డ్‌వేర్ వస్తువులుగా మారింది.అలాగే 3 వేల టన్నుల గాజు కొత్త సీసాలుగా తయారైంది.పేరుకుపోయిన రాళ్లు బలమైన కాంక్రీట్ స్లాబ్‌లుగా మారాయి. ఇక మిగిలిన ప్లాస్టిక్ అంతా బహిరంగ ఫర్నిచర్, ప్యాలెట్‌లు, రాక్‌లుగా మార్చివేశారు. ఇవి మళ్లీ 7-8 సార్లు తిరిగి వాడుకునే విధంగా తయారు అయ్యాయి.

పెరుంగుడి మోడల్ విజయవంతం కథ: ముందుగా ఇక్కడ చెత్తని శాస్త్రీయ పద్ధతిలో వేరు చేయడం మొదలు పెట్టారు. జీరో కాలుష్యాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు. వ్యర్థాలను వ్యర్థాలుగానే కాకుండా వనరులుగా చూడటం మొదలు పెట్టింది కంపెనీ. దీంతో పాటుగా స్థానిక ప్రజలకు కూడా ఉపాధి అవకాశాలు కల్పించడం మొదలు పెట్టింది. బ్లూ ప్లానెట్ సంస్థ ఇప్పటికే భారతదేశంలోని 9 రాష్ట్రాల్లో 700 ఎకరాల చెత్త మైదానాలను శుభ్రం చేసి దాదాపు 1.4 కోట్ల టన్నుల వ్యర్థాలను ప్రాసెస్ చేసింది. ఇప్పుడు చెన్నైలో మరో ప్రాజెక్ట్ (కొడుంగైయూర్‌లో) కూడా చేస్తున్నారు, ఇది పెరుంగుడి కంటే మూడు రెట్లు పెద్దదిగా కంపెనీ తెలిపింది.
తెలుగు రాష్ట్రాలు నేర్చుకోవాల్సిన పాఠం: హైదరాబాద్, విజయవాడ వంటి నగరాల్లో కూడా పేరుపోయిన చెత్త మైదానాలు ఉన్నాయి. ఇవి దశాబ్దాలుగా సమస్యగా మారి, విషపూరిత గ్యాస్‌లు, భూగర్భ జలాల కాలుష్యం, ఆరోగ్య సమస్యలు తెచ్చిపెడుతున్నాయి. చెన్నైలో చేసినట్లుగా సరైన బయోమైనింగ్ టెక్నాలజీ, పెట్టుబడులు, కఠినమైన భద్రతా తనిఖీలతో తెలుగు రాష్ట్రాలు కూడా ఈ సమస్యను తమకు అవకాశంగా మార్చుకోవచ్చు.
పెరుంగుడి ప్రాజెక్ట్ అన్ని రాష్ట్రాలకు ఒక ముఖ్యమైన సందేశం ఇస్తోంది. చెత్త అంటే సమస్య కాదు, దాన్ని సరైన విధంగా వాడితే అది వనరుగా మారుతుంది. చెన్నై చూపించిన మార్గాన్ని హైదరాబాద్, అమరావతి, విజయవాడ వంటి నగరాలు అనుసరిస్తే.. చెత్త మైదానాలు స్థిరత్వానికి, పర్యావరణ పరిరక్షణకు ప్రతీకలుగా నిలుస్తాయి.


Click it and Unblock the Notifications