Cheating: ఫేక్ కంపెనీలు, యాప్స్ ద్వారా ప్రజల నుంచి డబ్బు కొల్లగొట్టే కేటుగాళ్లనూ చూస్తూనే ఉంటాం. అయితే గుజరాత్ లో బయటపడిన ఈ సంఘటన చూస్తే నోరేళ్లబెట్టడం ఖాయం. ఇంత దర్జాగా, నడిరోడ్డు మీద జనాన్ని ఎలా మోసం చేశారా అని ఆశ్చర్య పోవడం అయితే పక్కా. వందలు, వేలు కాదు ఏకంగా కోట్లాది రూపాయల సొమ్మును దోచుకుని మోసానికి కాదేదీ అనర్హం అన్న రేంజ్‌లో సినిమా చూపించారు.
సాధారణంగా జాతీయ రహదారులపై ప్రయాణిస్తున్నప్పుడు టోల్ గేట్స్ దాటుకుని వెళ్లాల్సి ఉంటుంది. రోడ్ల నిర్మాణానికి వెచ్చించిన భారీ మొత్తాన్ని తిరిగి రాబట్టుకునేందుకు ఆయా సంస్థలు వీటిని ఏర్పాటు చేసి, కొంతమేర టోల్ రుసుమును వసూలు చేస్తుంటాయి. గుజరాత్ లో ఇదే తరహాలో ఓ టోల్ ప్లాజా వెలిసింది. ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేని ఈ టోల్ గేట్ ద్వారా ఏకంగా 80 కోట్ల రూపాయలను మోసగాళ్లు సొమ్ము చేసుకున్నారు.

మోర్బి జిల్లాలోని మోర్బి-వాంకనేర్ గ్రామాల మధ్యనున్న ఓ రోడ్డును 18 నెలల క్రితం కొందరు బాగు చేయించారు. దానికి అయిన ఖర్చును తిరిగి రాబట్టేందుకు టోల్ గేట్ ఏర్పాటు చేశారు. కార్లకు 100, లారీలకు 200 చొప్పున వసూలు చేయడం ప్రారంభించారు. అయితే దీనికి సంబంధించి ఎటువంటి అనుమతులు లేకుండా యథేచ్ఛగా దందా చేసేస్తున్నారు. ఇటీవల కొందరికి అనుమానం వచ్చి ఆరా తీయగా వారి బాగోతం బయటపడింది.
ఈ టోల్ గేట్ లో ఫాస్ట్ ట్యాగ్ లేదా డిజిటల్ పేమెంట్స్ ను అనుమతించేవారు కాదు. కేవలం నగదు మాత్రమే సేకరించేవారు. ఎవరైనా ఫాస్ట్ ట్యాగ్ గురించి అడిగితే స్టేట్ హైవేకు అనుబంధంగా ఉన్న రహదారి అని, నేషనల్ హైవే కాదని సమాధానం ఇచ్చేవారు. ఎట్టకేలకు ఈ వ్యవహారం కాస్తా జిల్లా కలెక్టర్ వరకు వెళ్లింది. దీంతో ఆయన దర్యాప్తుకు ఆదేశించడంతో పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. వీరిలో ఒకరు రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి కూడా ఉన్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications