టాటా గ్రూప్‌కు చెందిన టాటా సన్స్ సంస్థ ఛైర్మన్‌గా ప్రస్తుతం పదవిలో ఉన్న ఎన్. చంద్రశేఖరన్ పదవీకాలాన్ని మరో ఐదేళ్ల పాటు పొడిగించాలని టాటా ట్రస్ట్స్ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంది. కంపెనీ నాయకత్వంలో స్థిరత్వాన్ని కొనసాగించాలనే లక్ష్యంతో టాటా గ్రూప్ ఈ కీలక నిర్ణయం తీసుకుంది.సర్ రతన్ టాటా ట్రస్ట్, సర్ దోరాబ్జీ టాటా ట్రస్ట్, ఇతర ట్రస్టీలన్నీ ఈ తీర్మానానికి అంగీకరించాయి. టాటా సన్స్ బోర్డు కూడా త్వరలో దీనిని అధికారికంగా ఆమోదించే అవకాశం ఉంది.ఆయన 2030 వరకు ఈ పదవిలో కొనసాగనున్నారు.
టాటా ట్రస్టులు ప్రస్తుతం టాటా సన్స్‌లో 66 శాతం వాటా కలిగి ఉండటంతో.. ఈ నిర్ణయం సంస్థ భవిష్యత్తును ప్రభావితం చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇక షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ (SP గ్రూప్) 18.37 శాతం వాటాతో మైనారిటీ వాటాదారుగా ఉంది.టాటా గ్రూప్ నుంచి షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నిష్క్రమించేందుకు చర్చలు జరుపుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

చంద్రశేఖరన్ నాయకత్వంపై అన్ని ట్రస్టులు విశ్వాసాన్ని వ్యక్తం చేశాయి. గ్రూప్ వృద్ధికి ఆయన చేసిన కృషిని ట్రస్టులు మెచ్చుకున్నారు. టాటా గ్రూప్ లోని ఓ అధికారి మాట్లాడుతూ..చంద్రశేఖరన్ ఫలితాలు సాధించగలవాడని నిరూపించుకున్నాడు. అతని నాయకత్వం గ్రూప్‌లో స్థిరత్వాన్ని తీసుకురావడంలో కీలకమని అన్నారు. కొత్త వ్యాపారాలలో పెట్టుబడులను సమర్ధంగా నడిపించే, భవిష్యత్ ప్రణాళికకు ఆయన అనుభవం అవసరమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
టాటా సన్స్‌ను లిస్ట్ చేయకుండా ఉంచాలన్న వ్యూహాన్ని అమలు చేయడం.. RBIతో సంబంధిత అనుమతులు పొందడం వంటి క్లిష్టమైన బాధ్యతలు కూడా చంద్రశేఖరన్ భుజాలపై ఇప్పుడు ఉంటాయి. 2022లో NBFC-ULగా వర్గీకరించబడిన టాటా సన్స్..సెప్టెంబర్ 2025లో లిస్టింగ్ లేకుంటే నమోదు రద్దు కావాల్సి ఉంటుంది. దీనిపై ఇప్పటికే RBIకి మినహాయింపు కోరుతూ సంస్థ దరఖాస్తు చేసింది.
ఇక ఫిబ్రవరి 2022లో చంద్రశేఖరన్ రెండోసారి పదవిలోకి వచ్చిన తర్వాత.. టాటా గ్రూప్ ఆదాయం రెట్టింపు అయింది.అలాగే నికర లాభం, మార్కెట్ క్యాపిటలైజేషన్ మూడు రెట్లు పెరిగాయి. FY25 నాటికి గ్రూప్ ఆదాయం రూ. 15.34 లక్షల కోట్లుగా ఉండగా.. నికర లాభం రూ. 1.13 లక్షల కోట్లు గా ఉంది. మార్కెట్ క్యాప్ రూ. 37.84 లక్షల కోట్లకు చేరింది. ఈ కాలంలో రూ. 5.5 లక్షల కోట్ల పెట్టుబడులు కూడా వచ్చాయి. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ISB)లోని సౌగతా రే ఈ విషయంపై వ్యాఖ్యానిస్తూ..ఒక బహుళ తరాల కుటుంబ యాజమాన్య సంస్థకు స్థిరమైన నాయకత్వం అవసరం. చంద్రశేఖరన్ దీన్ని సమర్థవంతంగా అందిస్తున్నారని అన్నారు.


Click it and Unblock the Notifications