N Chandrasekaran: దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించటానికి ప్రభుత్వాలు ఎంత కృషిచేస్తాయో దానికి తగినట్లుగా ప్రైవేటు వ్యాపార సంస్థలు సైతం తమ వంతు పాత్ర పోషిస్తుంటాయి. ఇదే క్రమంలో దేశంలో అనేక వ్యాపారాల్లో నిమగ్నమై ఉన్న టాటా గ్రూప్ ఉపాధి అవకాశాలను కల్పించటంలోనూ ముందు వరుసలో నిలిచేందుకు సిద్ధం అవుతోంది. దీనికి సంబంధించి టాటా సన్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ కీలక ప్రకటన చేశారు.
రానున్న 5 ఏళ్ల కాలంలో టాటా గ్రూప్ 5 లక్షల మ్యానుఫ్యాక్చరింగ్ ఉద్యోగాలను సృష్టించనుందని టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ నేడు ఇండియన్ ఫౌండేషన్ ఫర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ మొదటి ఎడిషన్‌లో వెల్లడించారు. తయారీ రంగం ఒకపెద్ద అవకాశంగా తాను నమ్ముతున్నట్లు చంద్రశేఖరన్ పేర్కొన్నారు. ఈ రంగంలో ఉపాధి అవకాశాల సృష్టి వికసిత్ భారత్ లక్ష్యాలు సాధించటానికి కీలకమని పేర్కొన్నారు. ప్రతి నెల 10 లక్షల మంది జాబ్ మార్కెట్లోకి వస్తుండగా కోటి ఉద్యోకాల సృష్టి అవసరమన్నారు. సెమీకండక్టర్స్ లాంటి రంగంలో ఒక ప్రత్యక్ష ఉద్యోగానికి 8-10 పరోక్ష ఉపాధి అవకాశాలు పుట్టుకొస్తాయని అన్నారు.

ఈ తరుణంలో టాటా గ్రూప్ అసెంబ్లింగ్, ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీలు సంబంధిత పరిశ్రమల్లో రానున్న5 సంవత్సరాల్లో 5 లక్షల ఉద్యోగాలను సృష్టిస్తామని చంద్రశేఖరన్ ఆశాభావం వ్యక్తం చేశారు. చంద్రశేఖరన్ ప్రకారం ఉత్పాదక ఉద్యోగాలను సృష్టించడానికి కనీసం 500-1,000 MSMEల ఏర్పాటు కీలకంగా తెలుస్తోంది. దేశీయంగా మ్యానుఫ్యాక్చరింగ్ పెంచటంతో దేశంలోకి దిగుమతులు తగ్గటంతో పాటు విలువైన విదేశీ కరెన్సీ సేవ్ చేసుకోవచ్చు. అలాగే ట్రేడ్ డెఫిసిట్ సైతం క్రమంగా అదుపులోకి వస్తుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. పైగా రూపాయి విలువ సైతం దీర్ఘకాలంలో పెరుగుదలను చూస్తుంది.
ఏటా లక్షల సంఖ్యలో బయటకు వస్తున్న గ్రాడ్యుయేట్లకు ఉపాధి, సరైన ఉద్యోగాల కల్పన గురించి ఇప్పటికే దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రి అశ్వనీ వైష్ణవ్ కూడా అతిధిగా హాజరయ్యారు. గత దశాబ్దకాలంగా ఐఐటీ, ఐఐఎం వంటి విశ్వవిద్యాలయాల సంఖ్య పెరిగిందని ఆయన అన్నారు. సామాజిక, డిజిటల్, భౌతిక మౌలిక సదుపాయాలలో పెట్టుబడి కూడా ముఖ్యమైనదని అభిప్రాయపడ్డారు. యూపీఐ సక్సెస్ చూశామని, ప్రస్తుతం దేశంలో వేగంగా మౌలిక సదుపాయాల కల్పన జరుగుతున్న క్రమంలో తయారీ రంగానికి దేశంలో పునాది వేయాల్సిన సమయం ఆసన్నమైందని కేంద్ర మంత్రి నొక్కి చెప్పారు. ఇది వేగంగా వృద్ధి చెందుతున్న భారత ఆర్థిక వ్యవస్థతో పాటు పెరుగుతున్న జనాభాకు ఉపాధి కల్పనకు తోడ్పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.


Click it and Unblock the Notifications