Heritage Foods: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నికల ఫలితాల్లో సృష్టించిన ప్రభంజనం స్టాక్ మార్కెట్లను తాకిన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా మారిన బాబు.. ప్రస్తుతం తన కంపెనీలో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లకు సైతం ఊహించని లాభాలను అందిస్తున్నారు.
హెరిటేజ్ ఫుడ్స్ షేర్లు ప్రస్తుతం దేశీయ స్టాక్ మార్కెట్లలో అలజడి సృష్టిస్తున్నాయి. ఏపీ కొత్త సీఎం తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాడుయు కుటుంబం ప్రమోట్ చేస్తున్న హెరిటేజ్ ఫుడ్స్ షేర్లు సోమవారం 10% పెరిగి రూ.727.90కి చేరాయి. కంపెనీ షేర్లు గడచిన 12 రోజుల్లోనే పెట్టుబడిదారుల సొమ్మును 100% రాబడిని అందించాయి. మే 23, 2024న కంపెనీ షేర్లు రూ.354.50 వద్ద ముగిశాయి. అయితే నేడు జూన్ 10, 2024న హెరిటేజ్ ఫుడ్స్ షేర్ ఒక్కోటి రూ.727 దాటాయి. 5 రోజుల్లో కంపెనీ షేర్లు దాదాపు 70% పెరిగాయి.

ఆంధ్రప్రదేశ్‌కి నాలుగోసారి ముఖ్యమంత్రి కాబోతున్న చంద్రబాబు నాయుడుతో హెరిటేజ్ ఫుడ్స్‌కు ప్రత్యక్ష సంబంధం ఉంది. హెరిటేజ్ ఫుడ్స్‌లో భారీ డీల్ జరిగినట్లు వార్తలు కూడా వస్తున్నాయి. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం డీల్ విలువ రూ.319.60 కోట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగా దాదాపు 44 లక్షల షేర్లు చేతులు మారినట్లు నివేదికలు చెబుతున్నాయి. ప్రస్తుతం కంపెనీ షేర్ల 52 వారాల గరిష్ఠ స్థాయి రూ.727.90. అదే సమయంలో హెరిటేజ్ ఫుడ్స్ షేర్ల 52 వారాల కనిష్ట స్థాయి రూ.207.20గా ఉంది.
1992లో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా హెరిటేజ్ గ్రూప్‌ను ప్రారంభించబడింది. దేశంలో ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో భారీ మెజారిటీతో ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు మరోసారి ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఈ క్రమంలోనే ఆయన దేశ రాజకీయాల్లో కింగ్ మేకర్ కావటం వంటి పరిణామాలు హెరిటేజ్ ఫుడ్స్‌కు పెద్ద ఊపునిచ్చింది. హెరిటేజ్ ఫుడ్స్ డెయిరీ, రిటైల్, వ్యవసాయం అనే మూడు రంగాల్లో వ్యాపారాన్ని కొనసాగిస్తోంది. మే 29 నుంచి గత 8 ట్రేడింగ్ సెషన్లలో హెరిటేజ్ ఫుడ్స్ షేర్లు 95% పెరిగాయి.
రూ.1200 కోట్లకు పైగా లాభం:
మార్చితో ముగిసిన కాలానికి హెరిటేజ్ ఫుడ్స్‌లో చంద్రబాబు నాయుడు భార్య భువనేశ్వరి 24.37%, ఆయన కుమారుడు నారా లోకేష్ 10.82% వాటాను కలిగి ఉన్నారు. మే 23, 2024 నాటికి కంపెనీలో భువనేశ్వరి నారా, నారా లోకేష్‌ల వాటా విలువ రూ.1100 కోట్లకు పైగా ఉంది. ఇటీవల హెరిటేజ్ ఫుడ్స్ షేర్లు పెరిగిన తర్వాత వారు హోల్డ్ చేస్తున్న వాటాల విలువ రూ.2,300 కోట్లకు పైకి చేరింది. 2024లో ఇప్పటి వరకు హెరిటేజ్ ఫుడ్స్ షేర్లు దాదాపు 140% పెరిగాయి. అదే సమయంలో గడచిన ఏడాది కాలంలో కంపెనీ షేర్ ధర 235% కంటే ఎక్కువ పెరిగింది.


Click it and Unblock the Notifications