Adani Group: అదానీని అష్టదిగ్భందం చేసేందుకు త్రిశూల వ్యూహం.. పూర్తి వివరాలివే..!
Chandrababu Naidu: అదానీ వ్యాపారం ఎంత వేగంగా ముందుకు సాగుతోందో వాటిపై ఆరోపణలు సైతం అంతే వేగంగా ఉన్నాయి. ఒకదాని తర్వాత మరొక వివాదం అదానీని గడచిన రెండేళ్లుగా వెంటాడుతూనే ఉన్నాయి. ఆస్ట్రేలియా బొగ్గు, హిండెన్ బర్గ్ షేర్ స్కామ్, ఆఫ్రికా దేశంలో విమానాశ్రయాలు, ఓడరేవుల ఇలా దాదాపుగా చాలా అదానీ వ్యాపారాలపై ఏదోఒక ఆరోపణ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం అదానీ పవర్ వ్యాపారంలో లంచాల ఆరోపణలు అమెరికా కోర్టుల్లో బయటపడటం పెద్ద చర్చకు దారితీసింది.
ప్రస్తుతం ఈ వ్యవహారం ఏపీలో పెద్ద రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. అదానీ గ్రూప్ తన లాభాల కోసం పవర్ అగ్రిమెంట్లలో ఉన్నత స్థాయి అధికారులకు లంచాలు అందించినట్లు అమెరికా దర్యాప్తు సంస్థలు బయటపెట్టడం కూటమి ప్రభుత్వానికి-గత వైకాపా ప్రభుత్వానికి కొత్త సవాలును విసిరింది. ఈ క్రమంలో కాంట్రాక్టులను గెలుచుకోవడానికి లంచం తీసుకున్నారనే ఆరోపణలపై అమెరికా అభియోగాలు మోపిన తర్వాత అదానీ గ్రీన్ ఎనర్జీకి అనుసంధానించబడిన విద్యుత్ సరఫరా ఒప్పందాన్ని నిలిపివేయడానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడు ఆప్షన్లను పరిశీలిస్తోందని సమాచారం. ఇది ప్రజలపై భవిష్యత్తులో రూ.లక్ష కోట్లకు పైగా భారాన్ని మోపుతుందని వారు చెబుతున్నారు.

అదానీ గ్రీన్ ఎనర్జీతో గత ప్రభుత్వం కుదుర్చుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని రద్దు చేసి, కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణకు సిఫారసు చేయాలని ఆంధ్రప్రదేశ్ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి లేఖ రాయాలని భావిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ వర్గాల నుంచి తెలుస్తోంది. ఇక రెండవ ఆప్షన్ కింద లంచం ఆరోపణలను పరిశీలించడానికి క్యాబినెట్ సబ్‌కమిటీని ఏర్పాటు చేయడం, SECIతో సంతకం చేసిన విద్యుత్ సరఫరా ఒప్పందాన్ని నిలిపివేయడాన్ని కూటమి ప్రభుత్వం పరిగణిస్తోంది. ఇదే క్రమంలో చివరిగా పవర్ సేల్స్ అగ్రిమెంట్ పూర్తిగా స్క్రాప్ చేయాలని మూడవ ఆప్షన్ కింద గమనించబడుతోందని అంతర్గత సమాచారం. అయితే వీటిలో ఎక్కువ శాతం రాష్ట్ర ప్రభుత్వం ఎస్‌ఈసీఐకి లేఖ రాసి పీపీఏను రద్దు చేయమని కోరే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయని ప్రధాన మీడియా సంస్థల్లో ప్రచురించబడింది.
చంద్రబాబు కొత్త ప్లాన్ ఇదే..
న్యాయపరమైన చిక్కుల కారణంగా అదానీ గ్రీన్ ఎనర్జీతో జరిగిన పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ రద్దు చేసేందుకు ఏపీ సర్కార్ సానుకూలంగా లేదని తెలుస్తోంది. అయితే సోలార్ ప్లాంట్‌ను మరో రాష్ట్రంలో కాకుండా ఆంధ్రాలో ఏర్పాటు చేసే అవకాశంపై చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఇలా చేయటం వల్ల ట్రాన్స్‌మిషన్ ఖర్చులు భారీగా తగ్గిపోతాయి. వాస్తవానికి అదానీ నుంచి కొనుగోలు చేయాలనుకున్న యూనిట్ విద్యుత్ ధర రూ.2.49 సహేతుకమైనదేనని సీనియర్ మంత్రి ఒకరు చెప్పారు. కానీ ఇక్కడ రాజస్థాన్ రాష్ట్రం నుంచి దీనిని సరఫరా చేయటం వల్ల ట్రాన్స్‌మిషన్ ఖర్చులు యూనిట్ కి అదనంగా రూ.1.7 వెచ్చించాల్సి వస్తోందని టీడీపీ ప్రభుత్వం భావిస్తోంది. అందుకే ప్లాంట్లను ఏపీలో ఏర్పాటు చేయటం ఈ అనవసరపు ఖర్చులను నివారిస్తుందని కూటమి ప్రభుత్వం చెబుతోంది.


Click it and Unblock the Notifications