AP News: చంద్రబాబు అభివృద్ధి వ్యూహం.. తమిళనాడు, కర్ణాటకకు భారీ దెబ్బ..
Orvakal Industrial Hub: ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పెండింగ్ పనులు, అభివృద్ధికి సంబంధించిన అంశాలు చాలా వేగంగా ముందుకు సాగుతున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం ప్రధానంగా ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు పరిశ్రమలను భారీగా ఆహ్వానిస్తోంది. ఈ క్రమంలో పొరుగున ఉన్న కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రలోని ముంబై పూణే నగరాలను టార్గెట్ చేస్తూ శరవేగంగా అభివృద్ధికి వ్యూహాన్ని చంద్రబాబు ప్రభుత్వం సిద్ధం చేస్తోంది.
టీడీపీ కూటమి ప్రభుత్వం కర్నూలు ఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్ అభివృద్ధిపై దృష్టి సారించింది. ఇది రాష్ట్రంలో అగ్రిగేటర్, ఫుడ్ ప్రాసెసింగ్ ఇతర పరిశ్రమలకు వ్యాపార అవకాశాలు కల్పిస్తోంది. ఈ క్రమంలో ఇతర రాష్ట్రాల్లోని ఇండస్ట్రియల్ హబ్ లకు గట్టిపోటీదారుగా మారుతుందని తెలుస్తోంది. హబ్‌లో వివిధ రంగాలకు సంబంధించిన పరిశ్రమలు ఏర్పడనున్నాయని తెలుస్తోంది. తద్వారా 45 నుంచి 50 వేల మందికి ఆ ప్రాంతంలో కొత్త ఉపాధి అవకాశాలు కల్పించబడతాయని కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయి.

ఈ మెగా ప్రాజెక్ట్ కేంద్రంలోని మోదీ సర్కార్ నుంచి ఇటీవల నిధులను పొందనున్నట్లు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. సుమారు 2,621 ఎకరాల విస్తీర్ణంలో మౌలిక సదుపాయాల పెంపుదల కోసం కేంద్ర ప్రభుత్వం రూ.2,787 కోట్లతో స్థానికులకు ఉపాధి అవకాశాలను కల్పిస్తుందనే హామీతో ఓర్వకల్ మెగా ఇండస్ట్రియల్ హబ్ గణనీయమైన అభివృద్ధికి సిద్ధమౌతోంది. దీనికి తోడు కేంద్రం తన స్మార్ట్ పారిశ్రామిక నగరాల ప్రకటన సమయంలో కడప జిల్లా కొప్పర్తిలో ఇండస్ట్రియల్ హబ్ కింద 2,596 ఎకరాలను అభివృద్ధి చేసేందుకు రూ.2,137కోట్లను ఖర్చు చేయనున్నట్లు ఆగస్టు 28న ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ హబ్‌తో 54వేల మందికి ఉపాధి అవకాశాలు రానున్నట్లు కేంద్రం అంచనా వేస్తోంది.
ఓర్వకల్ ఇండస్ట్రియల్ హబ్ పనులను వేగవంతం చేసేందుకు కొద్ది రోజుల కిందట పరిశ్రమలు, వాణిజ్యం అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి టిజి భరత్ సందర్శించారు. గత ప్రభుత్వ హయాంలో ఈ ప్రాజెక్టు నిర్లక్ష్యానికి గురైందని చెప్పిన ఆయన కార్యకలాపాలను పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించారు. 2021లో ప్రతిపాధించిన నాటి నుంచి అనేక అడ్డంకులు, నిర్లక్ష్యాలకు గురైన మెగా ప్రాజెక్ట్ ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం పొందటంతో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని స్థానిక యువత భావిస్తోంది.
వైసీపీ ప్రభుత్వం మార్చి 2021లో మెగా ఇండస్ట్రియల్ హబ్‌ను ప్రారంభించింది. మొదట్లో దాదాపు 4,800 ఎకరాల్లో విస్తరించి. తర్వాత హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ చొరవలో భాగంగా కర్నూలు జిల్లాలోని ఓర్వకల్, ఉప్పలపాడు, గుట్టపాడు, మీడివేముల, ఉత్తర కొంతలపాడు సమీపంలో 10,000 ఎకరాలకు విస్తరించింది. ఈ ప్రాంతంలోని నిరుద్యోగులకు ఉపాధి కల్పించే విధంగా పారిశ్రామిక హబ్ పనులను వేగవంతం చేయాలని స్థానిక ప్రజలు రాష్ట్ర ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నారని దానికి అనుగుణంగానే పనులు వేగవంతం చేస్తున్నట్లు మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications