ICICI బ్యాంకు మాజీ సీఈవో చందాకొచ్చార్ భర్త దీపక్ కొచ్చార్‌ను సోమవారం ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ED) అరెస్ట్ చేసింది. వీడియోకాన్ గ్రూప్‌కు ఐసీఐసీఐ బ్యాంకు రుణాలిచ్చిన కేసులో మనీలాండరింగ్ ఆరోపణలకు సంబంధించి ఆయనను ఈడీ నిన్న సుదీర్ఘంగా విచారించింది. సోమవారం మధ్యాహ్నం నుండి ఆయనను విచారించి, రాత్రి అరెస్ట్ చేసింది. వీడియోకాన్ గ్రూప్‌కు చందాకొచ్చార్ హయాంలో ఐసీఐసీఐ బ్యాంకు రూ.1,875 కోట్ల మేర రుణాలు ఇచ్చింది. ఈ వ్యవహారంలో వీడియోకాన్ అధినేత వేణుగోపాల్ దూత్, చందాకొచ్చార్ మధ్య క్విడ్-ప్రోకో జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి.
మధ్యాహ్నం నుండి జరిపిన విచారణలో ఆధారాలు లభ్యం కావడంతో దీపక్ కొచ్చార్‍ను అరెస్ట్ చేశారు. చందాకొచ్చార్ దంపతులతో పాటు వేణుగోపాల్ దూత్ పైన కూడా మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద గత ఏడాది జనవరిలో క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. 2019 జనవరిలో 22 సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేయగా, జనవరి 31న ఈడీ మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. దీంతో చందాకొచ్చార్‌ను పదవి నుండి తప్పించారు. ఈ కేసులో పలుమార్లు విచారణ జరిపిన ఈడీ ఇప్పుడు దీపక్‌ను అరెస్ట్ చేసింది.

చందాకొచ్చార్ హయాంలో గుజరాత్‌లోని స్టెర్లింగ్ బయోటెక్ ఫార్మా కంపెనీ, భూషణ్ స్టీల్ గ్రూప్‌కు ఐసీఐసీఐ నుండి రుణాలు మంజూరు చేసేందుకు మనీలాండరింగ్‌కు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపైనా ఈడీ దర్యాఫ్తు చేస్తోంది. ఇదిలా ఉండగా, మనీ లాండరింగ్ కేసులో గత ఏడాది మార్చిలో ఈడీ స్వాధీనం చేసుకున్న తమ ఆస్తుల్ని విడుదల చేయాలని దీపక్ కొచ్చార్‌కు చెందిన పసిఫిక్ క్యాపిటల్ సర్వీస్ ప్రయివేటు లిమిటెడ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఆస్తుల సీజ్ ఏడాది మాత్రమే ఉంటుందని, ఈడీ ఛార్జీషీట్ దాఖలు చేయనందున ఆస్తులను విడుదల చేయాలని కోరింది. దీనిపై ఈడీ ఆభ్యంతరం వ్యక్తం చేసింది.


Click it and Unblock the Notifications