Apple Store: మెున్న దేశ ఆర్థిక రాజధాని ముంబైలో దేశంలో తమ మెుదటి స్టోర్ ను ఆపిల్ సంస్థ సీఈవో లాంచ్ చేశారు. ఈ క్రమంలోనే తాజాగా ఆయన రాజధాని దిల్లీలో తమ రెండవ స్టోర్ ను ప్రారంభించారు. దీంతో దేశంలో ఆపిల్ ఉత్పత్తుల వినియోగాన్ని పెంచాలని కంపెనీ భావిస్తోంది. అందుకే ఆపిల్ ప్రియులకు అందుబాటులో తమ స్టోర్లను ఏర్పాటు చేస్తోంది.
దేశంలో రెండవ, దిల్లీ మహానగరంలో మెుదటి స్టోర్ నేడు తెరచుకుంది. దీనిని చూసేందుకు వందల మంది ఆపిల్ ప్రియులు స్టోర్ వద్దకు చేరుకున్నారు. ఆపిల్ సాకేత్ స్టోర్‌ను గురువారం ఉదయం 10 గంటలకు కంపెనీ సీఈవో టిమ్ కుక్ ప్రారంభించారు. ఏప్రిల్ 18న ముంబైలోని జియో వరల్డ్ డ్రైవ్‌లో ప్రారంభించబడిన Apple BKC తర్వాత.. దిల్లీ సాకేత్‌లోని సెలెక్ట్‌సిటీ వాక్ మాల్ మొదటి అంతస్తులో కొత్త స్టోర్ అందుబాటులోకి వచ్చింది.

కస్టమర్ల కొనుగోలు అనుభవాన్ని మెరుగుపరచడంతో పాటు ఆఫ్‌లైన్ రిటైల్ మార్కెట్‌లో కంపెనీ ఉనికిని పెంచడమే లక్ష్యంగా ఆపిల్ తన సొంత అధికారిక స్టోర్లను ఏర్పాటు చేస్తోంది. అయితే.. దిల్లీలో ఏర్పాటు చేసిన స్టోర్లో దేశంలోని 15 భాషలు మాట్లాడగలిగిన 18 రాష్ట్రాలకు చెందిన 70 మంది సిబ్బందిని ఆపిల్ అందుబాటులో ఉంచింది. వీరు కస్టమర్లకు కొనుగోలు చేసే సమయంలో సహాయపడనున్నారు.
దిల్లీలో టిమ్ కుక్ ప్రారంభించిన కొత్త స్టోర్ ముంబైలో ఏర్పాటు చేసినదానికంటే చాలా సువిశాలమైనది. ఇక్కడ ఐఫోన్లు, మ్యాక్ బుక్స్, ఆపిల్ యాక్సిసరీస్, ఆపిల్ మ్యూజిక్, ఆపిల్ ఆర్కేడ్, Apple TVల కోసం ప్రత్యేక విభాగాలను కంపెనీ ఏర్పాటు చేసింది. ఈ స్టోర్లో దేశంలో కస్టమర్ల కోసం కంపెనీ తీసుకొచ్చిన ప్రతి వస్తువు అందుబాటులో ఉంచుతోంది. వీటిని సందర్శకులు పట్టుకుని, అనుభూతి పొంది కొనుగోలు చేసుకునే వెసులుబాటు ఉంది.
ఈ స్టోర్ ప్రత్యేకత ఏమిటంటే అన్ని ఇతర ఆపిల్ స్టోర్ల మాదిరిగానే కార్బన్ న్యూట్రల్. అంటే ఈ స్టోర్ 100 శాతం పునరుత్పాదక ఇంధనంతో నడుస్తుంది. ప్రారంభ సమయంలో అక్కడి వచ్చిన ఆపిల్ ప్రియులతో టిమ్ మాట్లాడుతూ, వారితో సెల్ఫీలు దిగుతూ జోష్ నింపారు.


Click it and Unblock the Notifications