Social Media: టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న కొద్దీ మంచితో పాటు చెడు కూడా అదే స్థాయిలో పెరుగుతోంది. మోసాలు, బెదిరింపులు, మార్ఫింగ్ వంటి వివిధ రూపాల్లో ప్రజలు బాధింపబడుతున్నారు. ఫేక్ వీడియోస్ వల్ల సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఇబ్బందులు పడుతున్నారు. వీటిని అరికట్టేందుకు కేంద్రం రంగంలోకి దిగింది.
సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ఇటీవల డీప్‌ఫేక్ వీడియోలు విపరీతంగా హల్ చల్ చేస్తున్నాయి. ఈ తరహా ఉదంతాలు పెరుగుతున్న నేపథ్యంలో.. ప్రభుత్వం చర్యలకు సిద్ధమైంది. మరో 3-4 రోజుల్లో గూగుల్, మెటా వంటి దిగ్గజ టెక్ సంస్థల ప్రతినిధులతో సమావేశం కానుంది. ఈ మేరకు కేంద్ర IT శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఓ ప్రకటన విడుదల చేశారు.

ఆయా సామాజిక మాధ్యమాలకు నోటీసులు పంపిన అనంతరం ఈ ప్రకటన వెలువడినట్లు తెలుస్తోంది. డీప్ ఫేక్ వీడియోలకు సంబంధించి అధికారిక ఫిర్యాదులేవీ అందనప్పటికీ, ఇందుకు సంబంధించిన కంటెంట్ ను తీసివేయమని టెక్ సంస్థలను కోరినట్లు ప్రభుత్వం వెల్లడించింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు తగిన చర్యలు తీసుకోకపోతే IT చట్టం కింద సేఫ్ హార్బర్ క్లాజ్ వర్తించదని పేర్కొంది.
'అన్ని ప్లాట్‌ఫారమ్‌లు నోటీసులకు స్పందించాయి. డీప్‌ఫేక్ సమస్యను పరిష్కరించడానికి ఆయా సంస్థలు తమ పద్ధతిలో ప్రయత్నిస్తున్నాయి కానీ ఇంకా చాలా చర్యలు తీసుకోవలసి ఉంటుందని మేము భావిస్తున్నాము. మరింత దూకుడుగా ఉండాలని వారికి చెప్పాము. వీటిని నిరోధించడానికి, వారి సిస్టమ్ ను శుభ్రపరిచేందుకు తగిన ప్రయత్నాలు జరిగేలా చూస్తాము' అని మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.
నటి రష్మిక మందన్న డీప్ ఫేక్ వీడియో ఇటీవల పలు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో హల్ చల్ చేసింది. దీనిపై పెద్ద దుమారం చెలరేగింది. ఆ తర్వాత పలువురు బాలీవుడ్ ప్రముఖులకు సంబంధించిన అనేక ఇతర వీడియోలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఇలా సాంకేతికత వల్ల ఎదురయ్యే సవాళ్లను పరిష్కరించడానికి ప్రభుత్వం డిజిటల్ ఇండియా బిల్లు రూపకల్పనపై పనిచేస్తోంది.


Click it and Unblock the Notifications