Income Tax News: కొత్తగా బడ్జెట్ ప్రవేశపెడుతున్నారంటే ఆసక్తిగా గమనించే వారిలో వేతన జీవులు ముందు వరుసలో ఉంటారు. ఎందుకంటే వ్యక్తిగత ఆదాయపు పన్నులో జరిగే మార్పులు తమకు నెలవారీ చేతికొచ్చే జీతాన్ని కొంతైనా పెంచుతాయేమోననే ఆశ. ఈ క్రమంలో వచ్చే నెలలో పూర్తి స్థాయి బడ్జెట్ ను ఆర్థిక మంత్రి హోదాలో నిర్మలమ్మ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనుంది. దీనిపై ఉద్యోగులకు చాలా అంచనాలే ఉన్నాయి.
కొత్త పన్ను విధానంతో పోలిస్తే పాత పన్ను విధానంలో చాలా మినహాయింపులు ఉంటాయి. అందుకే చాలా మంది పాత విధానానికే జై కొడుతున్నారు. కొత్త విధానాన్ని కూడా మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం పలు బెనిఫిట్స్ ను యాడ్ చేసింది. అయినా సరే ఇప్పటికీ చాలామంది ఓల్డ్ రెజీమ్‌లోనే కొనసాగుతున్నారు. కాగా ఇప్పుడు కొత్త విధానాన్ని ప్రజలచేత ఒప్పించేందుకు మరింత మసాలా యాడ్ చేసే ప్లాన్‌లో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది.

ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని పెంచే అవకాశాలను ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిశీలిస్తున్నట్లు సమాచారం. క్యాపిటల్ గెయిన్స్‌కు సంబంధించిన విధివిధానాల్లోనూ మార్పులు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ అంశంపై ఆదాయపు పన్ను శాఖతో సమీక్షలు జరుపుతున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. వివిధ అసెట్ క్లాస్‌లలో హోల్డింగ్ వ్యవధిని సమలేఖనం చేయాలనే డిమాండ్స్ ఉన్నా.. ప్రస్తుతం వాటి దిశగా ప్రభుత్వం మొగ్గుచూపకపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
బడ్జెట్ అనౌన్స్‌మెంట్‌కు ముందు ఆర్థిక శాఖ పలు వర్గాలతో ఇప్పటికే సంప్రదింపులు చేపట్టింది. పలు అంశాలపై అంతర్గత మదింపు జరుగుతోంది. చివరకు PMO నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్ ఆధారంగా ఫైనల్ నిర్ణయం తీసుకోనుంది. అయితే చాలా ప్రభుత్వ విభాగాలు మద్యతరగతికి చెందిన పన్ను చెల్లింపుదారులకు పలు రాయితీలు అందించే దిశగా ఆలోచించాలని సూచిస్తున్నట్లు సమాచారం. స్టాండర్డ్ డిడక్షన్ పెంపు వల్ల తక్కువ నుంచి ఎక్కువ జీతాలు పొందే ప్రతి ఒక్కరికీ ప్రయోజనం చేకూరుతుందని పరిశ్రమ ప్రముఖులు కూడా తమ అభిప్రాయపడినట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications