Tax News: పన్ను బాదుడుకు కేంద్రం నయా రూట్.. కొత్త సంవత్సరం నుంచి వాటిపై పోటు తప్పదు
New Tax Proposal: దేశంలో పెరుగుతున్న జీవన ప్రమాణాలకు అనుగుణంగా ప్రజల లైఫ్ స్టైల్ మారింది. సాధారణ వస్తువులతో పోలిస్తే ఖరీదైన విలాసవంతమైన ఉత్పత్తులను వినియోగించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. సరిగ్గా దీనినే పన్నులు బాదేందుకు ప్రభుత్వం ఆయుధంగా వినియోగించనుంది.
జనవరి 1, 2025 నుంచి ప్రజలపై మరో పన్ను భారం పడనుంది. 10 లక్షల కంటే ఎక్కువ ఖరీదు కలిగిన విలాసవంతమైన వస్తువులపై TCS కలెక్ట్ చేయనున్నట్లు బడ్జెట్ ప్రతుల్లో కేంద్రం పేర్కొంది. 'హై వాల్యూ ఖర్చుల సరైన ట్రాకింగ్ కోసం మరియు పన్ను పరిధిని విస్తరించేందుకు ఈ ప్రతిపాదన చేయబడింది. ఇందుకుగాను సెక్షన్ 206C సబ్-సెక్షన్ (1F)ని సవరించే అవకాశం ఉంది' అని ప్రభుత్వం అందులో నోటిఫై చేసింది.

ఇదే TCS కార్లకు కూడా వర్తిస్తుంది. అంటే 10 లక్షలకు మించి ఏదైనా వాహనాన్ని విక్రయించే వ్యక్తి, కొనుగోలుదారుడి నుంచి 1 శాతం ఎక్కువ కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మొత్తం అమ్మకం ధరలో 1 శాతం ఆదాయపు పన్నుగా పరిగణించబడుతుంది. ఈ వ్యవహారంలో కొనుగోలుదారులు IT రిటర్నులు దాఖలు చేసే సమయంలో TCS క్రెడిట్ క్లెయిమ్ చేయగలరని తెలుస్తోంది.
ఈ నిబంధనల కింద నోటిఫై చేయబడే అంశాల గురించి త్వరలోనే క్లారిటీ రానుంది. అయితే విలాసవంతమైన ఉత్పత్తులను ధనవంతులు ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు కాబట్టి పన్ను డిమాండ్‌ను తగ్గించే అవకాశం లేదని రిటైలర్లు మరియు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. గ్లోబల్ కన్సల్టెన్సీ నైట్ ఫ్రాంక్ వెల్త్ రిపోర్ట్ 2024 ప్రకారం, అల్ట్రా-హై-నెట్-వర్త్ వ్యక్తుల సంఖ్య 2023లోని 13 వేల 263 నుంచి 2028 నాటికి 19 వేల 908కి పెరుగుతుందని అంచనా.
సంపన్న వ్యక్తులలో ఈ పెరుగుదల భారతదేశంలో విలాసవంతమైన వస్తువులకు అభివృద్ధి చెందుతున్న డిమాండ్‌ను సూచిస్తుంది. బెయిన్ అండ్ కంపెనీ నివేదిక కూడా భారత్ లగ్జరీ మార్కెట్ దాని ప్రస్తుత పరిమాణానికి 3.5 రెట్లు పెరుగుతుందని అంచనా వేయబడింది. వేగవంతమైన ఆర్థిక వృద్ధి కారణంగా 2030 నాటికి ఇది 85 నుంచి 90 బిలియన్ డాలర్ల మార్కును టచ్ చేస్తుందని భావిస్తున్నారు. ఈ అంచనాలు ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న లగ్జరీ మార్కెట్‌గా భారతదేశాన్ని నిలబెట్టాయని విశ్లేషకులు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications