న్యూఢిల్లీ: దేశంలో వస్తు, సేవా పన్ను (జీఎస్టీ) అమల్లోకి వచ్చిన తరువాత హోటళ్లు, రెస్టారెంట్లల్లో బిల్లుల భారం తడిచిమోపెడైంది. ఏ ఆహార పదార్థానికి ఎంత మేర ధర పెంచారనే విషయంలో వాటి యజమానులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ధరల పెంపునకు ఓ ప్రాతిపదిక అనేది ఉండట్లేదు. అన్ని రకాల ట్యాక్స్‌లతో పాటు అదనంగా సర్వీస్ ఛార్జీలను వసూలు చేస్తుంటారు. ఈ సర్వీస్ ఛార్జ్ అనేది కనీసం 10 శాతానికి తక్కువగా ఉండదు. హోటల్ లేదా రెస్టారెంట్ స్థాయిని బట్టి ఇది మారుతుంటుంది.

ఇప్పటివరకు నో గైడ్‌లైన్స్..
జీఎస్టీకి తోడుగా కనీసం 10 శాతం మేర సర్వీస్ ఛార్జీలను వసూలు చేస్తోండటం వల్ల హోటళ్లు, రెస్టారెంట్లకు వెళ్లి భోజనం చేయడం అనేది ఖరీదైన వ్యవహారంగా మారింది. సర్వీస్ ఛార్జ్ అనేది తప్పనిసరి కాకపోయినప్పటికీ.. దాన్ని నిర్బంధంగా వసూలు చేస్తూ వస్తోన్నారు వాటి యజమానులు. సర్వీస్ ఛార్జీలను నియంత్రించడానికి ఇప్పటివరకు ప్రత్యేకంగా ఎలాంటి మార్గదర్శకాలు గానీ, నిబంధనలు గానీ లేవు. ఇది కాస్తా వారి అక్రమ వసూళ్లకు మరింత ప్రోత్సహించినట్టవుతోంది.

ఫిర్యాదులపై కదలిని కేంద్రం..
దీనిపై వినియోగదారుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందడంతో ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం స్పందించింది. దీన్ని నియంత్రించే దిశగా అడుగులు వేసింది. నేషనల్ రెస్టారెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, ఫెడరేషన్ ఆఫ్ హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధులతో కేంద్ర ఆహార సరఫరా, వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ సమావేశమైంది. వినియోగదారుల వ్యవహారాల విభాగం కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ ఈ సమావేశానికి సారథ్యం వహించారు.

అసోసియేషన్లతో కీలక భేటీ..
హోటళ్లు, రెస్టారెంట్లల్లో బిల్లింగ్ అంశం, నిర్బంధంగా సర్వీస్ ఛార్జీల వసూళ్లు.. వంటి కీలక అంశాలు ఇందులో చర్చకు వచ్చాయి. సుదీర్ఘంగా సాగిందీ భేటీ. హోటళ్లు, రెస్టారెంట్లల్లో సర్వీస్ ఛార్జీలను వసూలు చేయడాన్ని నియంత్రించేలా కొన్ని కఠిన నిర్ణయాలను తీసుకుంటామని కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ వెల్లడించారు. సమావేశం ముగిసిన అనంతరం- అందులో చర్చకు వచ్చిన అంశాలు, దీనిపై తీసుకున్న నిర్ణయాలతో కూడిన ఓ ప్రకటనను చేశారు.

త్వరలో గైడ్‌లైన్స్..
సర్వీస్ ఛార్జీల వసూళ్లపై తమ విభాగానికి వేల సంఖ్యలో ఫిర్యాదులు అందాయని, వాటిని ఈ భేటీ ప్రస్తావించినట్లు వివరించారు. సర్వీస్ ఛార్జీలను నియంత్రించడానికి ప్రత్యేకంగా ఎలాంటి మార్గదర్శకాలు గానీ, నిబంధనలు గానీ లేవని, వాటిని త్వరలోనే రూపొందిస్తామని స్పష్టం చేశారు. సర్వీస్ ఛార్జీలు అనేది స్వచ్ఛందమే అయినప్పటికీ- దాన్ని తప్పనిసరిగా వసూలు చేయాలనే నిబంధన ఏదీ లేదని తేల్చి చెప్పారు. వాటిని నియంత్రించేలా కఠిన మార్గదర్శకాలను రూపొందిస్తామని రోహిత్ కుమార్ సింగ్ పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications