కనికరించిన నిర్మలమ్మ: జీఎస్టీ లోటుభర్తీకి రూ.వేల కోట్లు: రాష్ట్రాలకు విడుదల
న్యూఢిల్లీ: కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం.. ఈ సారి అయిదు రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని సాధారణ బడ్జెట్‌ను రూపొందించిందంటూ దేశవ్యాప్తంగా విమర్శలు చెలరేగుతోన్న వేళ.. జీఎస్టీ బకాయిల కోసం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు మోడీ సర్కార్‌ను నిలదీయడానికి సన్నాహాలు చేస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో.. ఆర్థిక మంత్రిత్వ శాఖ అనూహ్య నిర్ణయాన్ని తీసుకుంది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెల్లించాల్సిన జీఎస్టీ బకాయిల్లో కొంత మొత్తాన్ని విడుదల చేసింది.
దీని విలువ 6,000 కోట్ల రూపాయలు. ఇందులో 5,516.6 కోట్ల రూపాయలు 23 రాష్రాలకు వెళ్తాయి. మిగిలిన 483.40 కోట్ల రూపాయల మొత్తం కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందుతుంది. ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్, లఢక్, పుదుచ్చేరిలకు ఈ మొత్తాన్ని కేటాయించింది. అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మిజోరం, నాగాలాండ్, సిక్కింలకు కేంద్రం నుంచి ఎలాంటి జీఎస్టీ బకాయిలు లేవు. వాటికి ఉన్న ఆర్థిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఎప్పటికప్పుడు జీఎస్టీ నిధులను విడుదల చేసింది.

తాజాగా విడుదల చేసిన 6,000 కోట్ల రూపాయల మొత్తంతో ఇప్పటిదాకా కేంద్రం మంజూరు చేసిన జీఎస్టీ బకాయిల శాతం 34 శాతానికి చేరినట్టయింది. అంటే- 76,616.16 కోట్ల రూపాయలను కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ విడుదల చేయాల్సి ఉండగా.. తాజా మొత్తంతో ఈ సంఖ్య 7,383.84కు చేరింది. జీఎస్టీ లోటును భర్తీ చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం.. అప్పులు చేయడానికి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు వెసలుబాటును కల్పించిన విషయం తెలిసిందే. దీనికోసం గత ఏడాది అక్టోబర్‌లో ప్రత్యేకంగా ఓ విండో సిస్టమ్‌ను ఏర్పాటు చేసింది. 1,10,000 కోట్ల మేర రుణాలను తీసుకోవచ్చని పేర్కొంది.
దీనితోపాటు- ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో చివరి రెండు నెలల కాలానికి స్వయంగా 80 వేల కోట్ల రూపాయల మేర అప్పులను తీసుకోబోతోన్నామని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించిన విషయం తెలిసిందే. వచ్చే ఏప్రిల్ 1వ తేదీ నుంచి ప్రారంభం కాబోయే 2021-2022 ఆర్థిక సంవత్సరానికి ఏకంగా 12 లక్షల కోట్ల రూపాయలను రుణంగా తీసుకోవాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు ఆమె పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications