Centre warning: ఆహార భద్రతపై కేంద్రం అప్రమత్తం.. ఆ వ్యాపారులకు తీవ్ర హెచ్చరికలు
Wheat stocking: దేశంలో ఆహార భద్రతకు ఎటువంటి విఘాతం కలగకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. సమయానుగుణంగా మార్కెట్ పరిస్థితులను అంచనా వేస్తూ.. బియ్యం, గోధుమలు, ఉల్లి, బంగాళదుంప, టమోటో వంటి ఉత్పత్తులపై నిషేధం విధిస్తూ ఓపెన్ మార్కెట్ ను కంట్రోల్ చేస్తోంది. తాజాగా ఉల్లి ఎగుమతులను బ్యాన్ చేసిన మోదీ గవర్నమెంట్.. గోధుమల నిల్వపై కీలక నిర్ణయం తీసుకుంది.
అన్ని రాష్ట్రాల్లోని హోల్ సేల్, రిటైల్ వ్యాపారులతో పాటు ఫుడ్ ప్రాసెసర్లకు.. గోధుమ స్టాక్ నిల్వపై పరిమితిని విధిస్తూ వినియోగదారుల వ్యవహారాల శాఖ నిర్ణయం తీసుకుంది. మార్చి 31, 2024 వరకు ఈ ఆంక్షలు అమలులో ఉండనున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం.. గోధుమ నిల్వలు, స్టాక్ పరిమితిని ఆయా సంస్థలు ప్రభుత్వ పోర్టల్ లో నమోదు చేయాలి. ప్రతి శుక్రవారం స్టేటస్ అప్డేట్ చేయాల్సి ఉంటుంది.

ఈ నిబంధనలను ఉల్లంఘించినా లేదా పోర్టల్ లో డేటా అప్లోడ్ చేయడంలో అలసత్వం వహించినా.. ఆయా సంస్థలపై నిత్యవసర వస్తువుల చట్టంలోని పలు సెక్షన్ల ప్రకారం చర్యలు తీసుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది. నోటిఫికేషన్ రిలీజ్ చేసే నాటికి ఓవర్ స్టాక్ ఉన్న వ్యాపారులు.. 30 రోజుల్లోపు నిర్దేశించిన పరిమితికి దాన్ని తీసుకురావాలని తేల్చి చెప్పింది. గత అనుభవాల దృష్ట్యా.. నిబంధనలు పాటించకపోతే తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించింది.
'గోధుమల కృత్రిమ కొరతను నివారించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారులు ఈ స్టాక్ పరిమితుల అమలను నిశితంగా పర్యవేక్షిస్తారు' అని వినియోగదారుల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇదే సమయంలో వాటి లభ్యతను పెంచేందుకు.. బహిరంగ మార్కెట్లో కేంద్రం బఫర్ స్టాక్ ను విక్రయించనుంది. 101.5 లక్షల టన్నులను క్వింటాకు 2 వేల 150 చొప్పున సబ్సిడీ ధరపై FCI ద్వారా రిలీజ్ చేయాలని నిర్ణయించింది.


Click it and Unblock the Notifications