దేశం.. ఎన్నికల ఏడాదిలో ప్రవేశించింది. వచ్చే అయిదారు నెలల్లో సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొనాల్సి ఉంది. మార్చి/ఏప్రిల్ నాటికి లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు ఉన్నాయి. మే చివరి వారం నాటికి కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడం దాదాపు ఖాయం.
ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మంగా తీసుకుంటోన్నాయి అన్ని పార్టీలు. వరుసగా మూడోసారి అధికారంలోకి రావడానికి భారతీయ జనతా పార్టీ సారథ్యంలో ఎన్డీఏ.. ఈ సారి గద్దెనెక్కడానికి ప్రతిపక్షాల ఉమ్మడి కూటమి ఇండియా సర్వశక్తులు ఒడ్డటం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు.. వీటికి సెమీ ఫైనల్స్‌గా భావిస్తోన్నాయి.

కాగా- ఈ పరిస్థితుల్లో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలను తీసుకునే అవకాశాలు ఉన్నాయి. 2024 బడ్జెట్‌లో భారీగా తాయిలాలను ప్రకటిస్తుందని తెలుస్తోంది. ఇందులో భాగంగా.. సంక్షేమ పథకాల కేటాయింపులను రెట్టింపు చేయొచ్చని చెబుతున్నారు.
ప్రధానంగా పీఎం కిసాన్ (PM Kisan) బడ్జెట్ కేటాయింపులను భారీగా పెంచొచ్చనే అంచనాలు వ్యక్తమౌతోన్నాయి. ప్రస్తుతం పీఎం కిసాన్ పథకం కింద దేశవ్యాప్తంగా ఒక్కో రైతుకు అందుతున్న నగదు మొత్తంలో అదనంగా 1,500 రూపాయలను చేర్చాలనేది కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం.
ప్రస్తుతం పీఎం కిసాన్ పథకం కింద ఒక్కో రైతు ఖాతాలో 6,000 రూపాయలను జమ చేస్తోంది కేంద్రం. వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ మొత్తాన్ని 7,500 రూపాయలను పెంచాలని భావిస్తోంది. దీనికోసం బడ్జెట్‌లో భారీగా కేటాయింపులు చేయనుంది.
పీఎం కిసాన్ పథకానికి ఇప్పుడు కేటాయించిన మొత్తానికి అదనంగా మరో లక్ష కోట్ల రూపాయలను చేర్చే అవకాశాలను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిశీలిస్తోంది. దీనికి అవసరమైన కసరత్తు సైతం మొదలు పెట్టినట్లు చెబుతున్నారు. పెంచిన మొత్తాన్ని అంటే ఇప్పుడున్న 6,000 రూపాయలను 7,500 రూపాయలకు పెంచి.. 2024 హోలీ పండగకు విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications