Pension for artists: ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగులు వారి PF అకౌంట్ ఆధారంగా వృద్ధాప్యంలో పింఛను పొందుతారు. ఇక సామాన్యుల కోసం సామాజిక భద్రతా పెన్షన్లను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. అయితే దేశవ్యాప్తంగా కళా రంగానికి సేవలందించిన వారికి కేంద్ర ప్రభుత్వం కూడా పింఛను రూపంలో ఆర్థిక సహాయం అందిస్తూ వస్తోంది. దీని గురించి పెద్దగా తెలియక పోవడంతో అర్హత కలిగినవారు సమర్థవంతంగా వినియోగించుకోలేకపోతున్నారు.
వార్షిక ఆదాయం 72 వేల దిగువన ఉండి, 60 ఏళ్లు మరియు అంతకంటే పైబడి వయస్సు కలిగిన ప్రముఖ కళాకారులకు కేంద్రం ఆర్థిక సహాయం చేస్తోంది. ఈ మేరకు వెటరన్ ఆర్టిస్ట్‌ల కోసం సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఒక పథకాన్ని నిర్వహిస్తోంది. దీనికింద ఎంపికైన కళాకారులకు నెలకు గరిష్ఠంగా 6 వేలు నగదు అందజేస్తోంది. తమ యుక్త వయస్సులో కళా రంగానికి విశేష సేవలు అందించి, వృద్ధాప్యంతో ఇబ్బంది పడుతున్న పేదలను ఆదుకుంటోంది.

వారి ఆర్థిక మరియు సామాజిక స్థితిని మెరుగుపరచడానికి ఈ పథకం ఉద్దేశించబడినది. 2022 నుండి ఈ స్కీమ్ అమలులోకి వచ్చింది. దీనికింద ఆర్థిక సహాయం మొత్తాన్ని ఇటీవల 4 నుంచి 6 వేలకు పెంచారు. గతంలో ప్రతి సంవత్సరం ఆదాయ ధృవీకరణ పత్రాన్ని సమర్పించాలనే నిబంధన ఉండేది కానీ ఇప్పుడు తొలగించారు. అందుకు బదులుగా ఐదేళ్లకు ఒకసారి మాత్రం దీన్ని సమర్పించాల్సి ఉంటుంది.
ఈ పథకం కింద దరఖాస్తు చేసుకునే కళాకారుడు ఇంతకుముందు తప్పనిసరిగా సంబంధిత రాష్ట్రం/UT నుంచి కనీసం నెలకు 500 ఆర్టిస్టుల పెన్షన్ గ్రహీత అయి ఉండాలి. ప్రస్తుతం ఈ షరతు సడలించబడింది. రాష్ట్రం నుంచి ఆ వ్యక్తి పెన్షన్ పొందనట్లయితే సంబంధిత జోనల్ కల్చరల్ సెంటర్ (ZCC), సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ద్వారా కళాత్మక ఆధారాల ధృవీకరణతో పాటు సిఫార్సు తెచ్చుకోవచ్చనే సౌలభ్యం కల్పించారు.


Click it and Unblock the Notifications