Employees Rules: ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం వార్నింగ్.. అలాంటి వారి బెండు తీసేందుకు యాక్షన్ షురూ
Centre strict rules: ఏళ్లతరబడి ప్రభుత్వ కార్యాలయాల్లో పెరిగిపోయిన ఓ అలవాటును మార్చేందుకు మోదీ ప్రభుత్వం సిద్ధమైంది. అందుబాటులో ఉండని సిబ్బందిపై కొరడా ఝళిపించేందుకు రెడీ అయింది. పలు కొత్త నిబంధనలను ప్రవేశపెడుతూ నిర్ణయం తీసుకుంది. పాటించని వారిపై తీవ్ర చర్యలు తీసుకునేందుకు వెనకాడబోమని స్పష్టం చేసింది.
సమయపాలన పాటించని ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్రం హెచ్చరించింది. కార్యాలయానికి ఆలస్యంగా హాజరు కావడం, ఆఫీసు నుంచి త్వరగా బయలుదేరడం అలవాటుగా మారిన అధికారుల ప్రవర్తనను తీవ్రంగా పరిగణించాలని పేర్కొంది. అనేక మంది ఆధార్ ఎనేబుల్డ్ బయోమెట్రిక్ అటెండెన్స్ సిస్టమ్ (AEBAS)లో తమ హాజరును నమోదు చేయడం లేదని, కొంతమంది ఉద్యోగులు రోజూ ఆలస్యంగా వస్తున్నారని గుర్తించిన తర్వాత చర్యలకు ఉపక్రమించింది.

లైవ్ లొకేషన్ డిటెక్షన్ మరియు జియో-ట్యాగింగ్ అందించే మొబైల్ ఫోన్ ఆధారిత ఫేస్ అథెంటికేషన్ సిస్టమ్‌ను ఉపయోగించాలని సిబ్బంది మంత్రిత్వ శాఖ ఒక ఆర్డర్‌లో సూచించింది. EBAS అమలును ఇటీవల సమీక్షించామని, సిబ్బంది అలసత్వాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు చెప్పింది. అన్ని మంత్రిత్వ శాఖలు, డిపార్ట్‌మెంట్‌లు మరియు సంస్థలు(MDO) ఉద్యోగుల హాజరు నివేదికలను క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని ఆదేశించింది.
MDOల HODలు అందరూ తమ ఉద్యోగుల హాజరుకు సంబంధించి www.attendance.gov.in పోర్టల్ నుంచి కన్సాలిడేటెడ్ రిపోర్ట్‌ను రోజూ డౌన్‌లోడ్ చేసి, డీఫాల్టర్లను గుర్తించాలి అని కేంద్రం తన ఆర్డర్‌లో పేర్కొంది. ఆలస్యంగా హాజరైన ప్రతి రోజుకు సగం రోజు క్యాజువల్ లీవ్ (CL) డెబిట్ చేయబడాలని తెలిపింది. నెలలో 2 సందర్భాలు మించకుండా 1 గంట వరకు ఆలస్యంగా హాజరు కావడానికి అనుమతించాలని సూచించింది. అయితే అందుకు కారణం సమర్థించదగినదిగా ఉండాలని స్పష్టం చేసింది. ఈ నిబంధనలు పాటించని పక్షంలో క్రమశిక్షణా చర్యలు ప్రారంభించాలని తేల్చి చెప్పింది.
'ముందస్తుగా బయలుదేరడం కూడా ఆలస్యంగా వచ్చినట్లుగానే పరిగణించబడుతుంది. ముఖ్యమైన అసైన్‌మెంట్‌లు, శిక్షణలు, డిప్యుటేషన్‌లు, బదిలీలు, పోస్టింగ్‌ల వేళ సదరు ఉద్యోగి సమయపాలన మరియు హాజరు డేటాను కూడా పరిగణనలోకి తీసుకోవాలి' అని కేంద్రం తెలిపింది. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) రూపొందించిన ఆండ్రాయిడ్/iOS ఆధారిత ఫోన్‌లను ఉపయోగించి ఫేస్-బేస్డ్ అథెంటికేషన్ అప్లికేషన్‌ల వినియోగాన్ని కూడా హైలైట్ చేసింది.


Click it and Unblock the Notifications