Real Estate: రియల్ ఎస్టేట్‌పై గురిపెట్టిన కేంద్రం.. బ్లాక్ మనీ ప్రవాహానికి అడ్డుకట్ట పడనుందా..?
Black Money: కేంద్రంలోని భాజపా సర్కారు ముందునుంచి నల్లధనం కట్టడిపై కఠిన వైఖరి అనుసరిస్తూ వస్తోంది. పన్ను ఎగవేతలకు అడ్డుకట్ట వేసేందుకు వివిధ రకాలుగా ప్రయత్నిస్తోంది. అయితే ఈ తరహా కార్యకలాపాలకు స్వర్గధామంగా వెలుగొందుతున్న రియల్ ఎస్టేట్ రంగంపై ఉక్కు పాదం మోపేందుకు సిద్ధమవుతోంది.
రియల్ ఎస్టేట్ రంగంలో లెక్కల్లో చూపని నల్లధనం ప్రవాహాన్ని అడ్డుకునేందుకు పలు చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ప్రకటించారు. ఇందుకోసం వివిధ కీలక చట్టాలకు ఇప్పటికే సవరణలు చేసినట్లు పార్లమెంటులో లేవనెత్తిన ప్రశ్నలకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. అవసరాలకు అనుగణంగా మరింత దూకుడు పెంచేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.

ఈ తరహా లావాదేవీల్లో నగదు చెల్లింపులను నివారించడానికి బ్యాంకింగ్ ఛానల్స్ ద్వారా పేమెంట్స్ చేసేందుకు నిబంధనల్లో మార్పులు చేసినట్లు వెల్లడించారు. 20 వేల కంటే ఎక్కువ విలువైన రసీదులను నిషేధించే విధంగా సెక్షన్ 269SSను సవరించినట్లు స్పష్టం చేశారు. పారదర్శకతను పెంచేందుకు సెక్షన్ 269T కింద ఇదే తరహా పరిమితి విధించినట్లు తెలిపారు. పాన్ సమర్పణ, అధిక విలువ కలిగిన లావాదేవీల నివేదన తప్పనిసరి చేసినట్లు వివరించారు.
బినామీ లావాదేవీలను నిషేధించడం కోసం 1989లో తీసుకొచ్చిన చట్టానికి 2016లో సవరణలు జరిపినట్లు మంత్రి గుర్తు చేశారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఈ విధమైన ట్రాన్సక్షన్స్ ఎక్కువగా జరిగే అవకాశం ఉండడంతో.. ఆదాయపు పన్ను చట్టం 1961 నిబంధన ప్రకారం తగిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు సోదాలు, సర్వేలు నిర్వహించడంతో పాటు ఆదాయ అంచనాలు, పన్ను మరియు జరిమానా విధింపులు, అవసరమైతే విచారణ ప్రారంభించడం వంటి పద్ధతులను అమలు చేస్తున్నట్లు స్పష్టం చేశారు


Click it and Unblock the Notifications