Renewal Energy: ఇంధన వనరులపై కేంద్రం సీరియస్ ఫోకస్.. వీటిలో ఇన్వెస్ట్ చేస్తే భవిష్యత్ బంగారమే!
2024 Investments: ప్రధాని మోదీ నిర్దేశించిన 5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా ఎదిగేందుకు భారత్ శరవేగంగా దూసుకెళ్తోంది. ఇందులో భాగంగా ఖర్చుల్లో సింహభాగం ఆక్రమిస్తున్న పెట్రో ధరలకు కళ్లెం వేయాలని భావిస్తోంది. అందుకే పునరుత్పాదక ఇంధన వనరులపై దృష్టి సారించింది. రానున్నరోజుల్లో ఆ రంగాన్ని ఏ విధంగా ముందుకెళ్లాలో అనే విషయంపై కేంద్రం పక్కా క్లారిటీతో ఉంది.
కర్బన ఉద్గారాలను తగ్గించడమే ప్రథమ లక్ష్యంగా ఇంధన పరివర్తనపై దేశం దృష్టి సారించింది. అందుకు తగినట్లుగా 2024లో పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులలో పెట్టుబడులు 83 శాతానికి మించి పెరగవచ్చని విద్యుత్ మంత్రిత్వ శాఖ అంచనా వేసింది. వీటి మొత్తం విలువ 16.5 బిలియన్ డాలర్లకు చేరుతాయని భావిస్తోంది.

2030 నాటికి 500 GW పునరుత్పాదక శక్తిని కలిగి ఉండాలనే భారత లక్ష్యానికి ఇది మరింత సహకారం అందిస్తుందని అంచనా. శిలాజ ఇంధనాల నుంచి విద్యుత్ ఉత్పత్తిని 50 శాతం కంటే దిగువకు తగ్గించాలనే టార్గెట్‌కు అనుగుణంగా తీసుకుంటున్న చర్యలు ఇందుకు కారణంగా చెప్పుకోవచ్చు. కాగా 2070 నాటికి నికర సున్నా ఉద్గారాలను చేరుకోవడమే ఇండియా లక్ష్యంగా పెట్టుకోగా.. సాధ్యమైనంత త్వరగా దాన్ని ఛేదించాలని ఆశిస్తోంది.
పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ఆర్కే సింగ్ పలు సందర్భాల్లో తమ ఆలోచనలను పంచుకున్నారు. 2030 నాటికి 65 శాతం విద్యుదుత్పత్తి శిలాజేతర వనరుల నుంచే చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు. '2023లో 13.5 GW పునరుత్పాదక ఇంధన సామర్థ్యం కోసం 74 వేల 250 కోట్లు ఇన్వెస్ట్‌మెంట్స్ జరిగాయి. అయితే 2024లో 25 GW సామర్థ్యం కోసం లక్షా 37 వేల 500 కోట్ల మేర పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది' అని వెల్లడించారు.


Click it and Unblock the Notifications