MGNREGA: UPA ప్రభుత్వ హయాం నుంచి నిరాటంకంగా నడుస్తున్న కేంద్ర పథకం MGNREGA. గ్రామీణ ప్రాంతాల్లో నైపుణ్యం లేని కుటుంబాల జీవనోపాధిని పెంపొందించడానికి దీనిని రూపొందించారు. దీని ప్రకారం ఒక ఆర్థిక సంవత్సరంలో ప్రతి కుటుంబానికి కనీసం 100 రోజుల వేతనంతో కూడిన ఉపాధిని ప్రభుత్వం అందిస్తుంది. లాక్ డౌన్ సమయంలో కోట్లాది మందికి కడుపు నింపిన అన్నపూర్ణ ఈ స్కీమ్. దీని కింద కూలీలకు ఇస్తున్న వేతనాలను మోడీ సర్కారు సమీక్షించి, ఓ శుభవార్త చెప్పింది.
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGA) కింద ఇప్పటి వరకు చెల్లిస్తున్న వేతనాలను పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. తాజా పెంపు తర్వాత హర్యానాలో రోజువారీ వేతనం అత్యధికంగా రూ.357 మరియు మధ్యప్రదేశ్ & చత్తీస్‌గఢ్‌లలో అత్యల్పంగా రూ.221కి చేరింది. అయితే ఇది 2023-24 ఆర్థిక సంవత్సరానికి వర్తించనుంది.

వేతనాల మార్పుపై కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ మార్చి 24న నోటిఫికేషన్ విడుదల చేసింది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MGNREGA), 2005 సెక్షన్ 6 (1) ప్రకారం దీనిని జారీ చేసింది. ఆయా రాష్ట్రాలను బట్టి రూ.7 నుంచి రూ.26 వరకు పెంపు వర్తిస్తుంది. ఏప్రిల్ 1 నుంచి కొత్త రేట్లు అమల్లోకి రానున్నాయి.
గతేడాది రేట్లతో పోలిస్తే అత్యధిక శాతం వేతనాలు రాజస్థాన్‌లో పెరిగాయి. 2022-23లో ఇక్కడ రూ.231 ఉండగా.. తాజా సవరణతో రోజువారీ వేతనం రూ.255కి చేరింది. బీహార్, జార్ఖండ్ గతేడాది కంటే దాదాపు 8 శాతం పెరుగుదల నమోదు చేశాయి. కర్ణాటక, గోవా, మేఘాలయ, మణిపూర్‌లు అత్యల్ప లబ్ధి పొందాయి. ఆయా రాష్ట్రాల్లో ఈ పెరుగుదల 2 నుంచి 10 శాతం మధ్య ఉంది.


Click it and Unblock the Notifications