AP News: AP వద్ద కేంద్ర షిప్పింగ్ శాఖ కీలక ప్రతిపాదన.. BPCLకు అనుబంధంగా మరో ప్రాజెక్ట్
Shipping ministry: కొత్త ప్రభుత్వం ఏర్పాటుతో జోష్ మీద ఉన్న ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం నుంచి శుభవార్త అందింది. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చేందుకు చంద్రబాబు సర్కారు అవిశ్రాంతంగా పనిచేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికీ జాతీయ స్థాయిలో కొన్ని ప్రాజెక్టులు APకి మంజూరు అయ్యాయి. ఇవన్నీ ఒకెత్తు అయితే కేంద్రమే రాష్ట్రానికి ఒక బంపర్ ఆఫర్ ఇచ్చింది. దీనిపై AP ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉందని వార్తలు వస్తున్నాయి.
ఓ భారీ రిఫైనరీ ఏర్పాటు దిశగా ఇటీవల BPCL అడుగులు వేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు మార్క్ రాజకీయంతో ఆ ప్రాజెక్టు ఆంధ్ర రాష్ట్రానికి మంజూరైంది. మచిలీపట్నం, రామాయపట్నం, మూలపేటలో ప్రాజెక్టు నెలకొల్పేందుకు ప్రభుత్వం భూమిని సమకూర్చాల్సి ఉంది. ఈ డీల్ ఇంకా పూర్తికాకుండానే కేంద్ర షిప్పింగ్ మంత్రిత్వ శాఖ AP వద్ద కీలక ప్రతిపాదన చేసింది.

సాధారణంగా రిఫైనరీలు ముడి సరుకును ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటాయి. ఈ ఇంపోర్ట్స్ ఎక్కువగా సముద్ర రవాణా ద్వారా జరుగుతుంది. APకి BPCL రిఫైనరీ మంజూరు కావడంతో పనిలో పనిగా అక్కడే పోర్టు నిర్మిస్తే ఖర్చు కూడా కలిసి వస్తుందని షిప్పింగ్ శాఖ ప్రపోజల్ పెట్టింది. తద్వారా రిఫైనరీ ఓ యాంకర్ పాయింట్ గా మారుతుందని, మొదటి నుంచీ పోర్టుకు ఆదాయాన్ని అందించగలుగుతుందని బలంగా విశ్వసిస్తోంది.
దీంతో ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్న చందాన రిఫైనరీ కోసం వేసిన స్కెచ్ అదనంగా పోర్టును తెచ్చి పెడుతోందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇది సాకారం అయితే రాష్ట్రంలో భారీ ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఎన్నో ఏళ్లుగా అభివృద్ధికి నోచుకోని మారుమూల ప్రాంతాలు కూడా ఈ ప్రాజెక్టుల్లో భాగమవుతాయని, తద్వారా రాష్ట్ర ఖజానాకు దండిగా ఆదాయం అందుతుందని సమాచారం.


Click it and Unblock the Notifications