Electric Vehicles: ఇంధన రంగంలో ఇటీవల విప్లవాత్మక మార్పులు వచ్చాయి. గతంలో పెట్రోల్, డీజిల్ మాత్రమే వాహనాల్లో వినియోగించేవారు. కాలక్రమేణా CNG, ఎలక్ట్రిక్, హైడ్రోజన్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం వల్ల ఆర్థిక వ్యవస్థతో పాటు పర్యావరణానికి మేలు కలగడమే కాకుండా నెట్ జీరో కార్బన్ దిశగా అడుగులు వేస్తున్న భారత్ ఆశయానికి ఊతమిచ్చినట్లవుతుంది.
ఇందుకు అనుగుణంగా ప్రభుత్వం ఎలక్ట్రిక్ మొబిలిటీని ప్రమోట్ చేస్తోంది. విద్యుత్ ఆధారిత వాహనాల కొనుగోళ్లను పెంచేందుకు రాయితీ సైతం అందిస్తోంది. దీనికోసం కేంద్ర ప్రభుత్వం 'ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ 2024'ని మరో రెండు నెలలు పొడిగించాలని నిర్ణయించింది. అంటే సెప్టెంబర్ 30తో ఈ స్కీమ్ గడువు ముగియనున్నట్లు భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ పథకం బడ్జెట్‌ను 778 కోట్లకు పెంచినట్లు ప్రకటించింది.

ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ 2024ని వాస్తవానికి మార్చి 13, 2024న గెజిట్ నోటిఫికేషన్ ద్వారా ప్రభుత్వం ప్రారంభించింది. తొలుత 500 కోట్ల బడ్జెట్‌తో ఏప్రిల్ 1 నుంచి జూలై 31, 2024 వరకు ఈ స్కీమ్‌ని అందుబాటులోకి తెచ్చారు. కాగా ఇప్పుడు దానిని పొడిగించి బడ్జెట్ కేటాయింపులను కూడా పెంచారు. EVల వినియోగదారులకు సబ్సిడీ ప్రయోజనాలు అందిస్తుండటంతో ఈ పథకం ప్రాముఖ్యత సంతరించుకుంది.
ఈ స్కీమ్ కింద ద్విచక్ర EVల కొనుగోలుదారులు 10 వేలు, చిన్న మూడు చక్రాల EVలకు 25 వేలు మరియు పెద్ద త్రీ-వీలర్ EVలకు 50 వేల వరకు రాయితీ ప్రయోజనాన్ని పొందవచ్చు. దీనిద్వారా 5 లక్షలకు పైగా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు (e-2Ws) మరియు 60 వేలకు మించి త్రీ-వీలర్స్ (e-3Ws)తో మొత్తం 5 లక్షల 60 వేల EVలను సపోర్ట్ చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పరిశ్రమల శాఖ తెలిపింది.


Click it and Unblock the Notifications