AI News: ప్రపంచమంతా ప్రస్తుతం AI నామ జపం చేస్తోంది. అందుకే దీనిపై భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. పనిలో పనిగా అంతర్జాతీయ దిగ్గజం గూగుల్ భారతీయ స్టార్టప్ యాప్స్ పట్ల చూపిస్తున్న తీవ్ర వైఖరికి అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సహా స్టార్ట్ అప్ ఎకో సిస్టం పై పెద్ద మొత్తంలో వెచ్చించాలని భావిస్తోంది.
మరో 5 ఏళ్ల పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాజెక్టులను దేశంలో విస్తృతం చేసేందుకు 10 వేల 372 కోట్లను ఇన్వెస్ట్ చేయనున్నట్లు కేంద్ర IT శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. కంప్యూటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, AI స్టార్టప్ లకు ఆర్థిక సాయం అందించేందుకు ఈ నిధులు వినియోగించనున్నట్లు ప్రకటించారు. మిషన్ డిజిటల్ ఇండియా కార్పొరేషన్ ఆధ్వర్యంలో AI ఇండిపెండెంట్ బిజినెస్ డివిజన్ ద్వారా ఈ కార్యకలాపాలు అమలు చేయనున్నట్లు తెలిపారు.

పూర్తిస్థాయి AI ఎకో సిస్టం రూపొందించేందుకు 10 వేల గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్లు(GPU) కలిగిన సూపర్ కంప్యూటర్ సామర్థ్యాన్ని వాటాదారులకు అందుబాటులో ఉంచుతామన్నారు. CPU ఆధారిత సర్వర్లతో పోలిస్తే అధిక వేగంతో డేటాను ప్రాసెస్ చేయగలగడం వల్ల వీటికి బాగా డిమాండ్ ఏర్పడినట్లు చెప్పారు. ఈ మిషన్ కింద AI ఇన్వెన్షన్ సెంటర్ ఏర్పాటుచేసి ఓ ప్రముఖ విద్యా సంస్థగా దాన్ని నిర్వహించాలని చూస్తున్నట్లు పేర్కొన్నారు.
నాస్కామ్ అంచనాల ప్రకారం 2027 నాటికి భారత AI మార్కెట్ 17 బిలియన్ డాలర్లకు చేరుకుంటుంది. ఇదే సమయంలో అంతర్జాతీయ మార్కెట్ 297 బిలియన్ డాలర్ల మేరకు పెరుగుతుందని అమెరికా సంస్థ గార్ట్‌నర్ లెక్క కట్టింది. ఈ ప్రకారం చూస్తే ఇండియన్ AI ప్రపంచ స్థాయిలో చాలా వెనుకబడి ఉన్నట్టే. దీనిని మార్చేందుకే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీపై కేంద్రం పెద్దమొత్తంలో పెట్టుబడులు పెడుతోంది.


Click it and Unblock the Notifications