online gaming: ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీలపై కేంద్రం సీరియస్.. లక్ష కోట్ల విలువైన నోటీసులు జారీ
online gaming: పన్నుల వసూళ్లు విషయంలో కేంద్రం సీరియస్ గా వ్యవహరిస్తోంది. ఇటీవల ఆన్ లైన్ గేమింగ్ పై GSTని పెంచగా.. ఆ రంగానికి చెందిన డెల్టా కార్ప్ కి షాక్ మీది షాకిచ్చింది. ఇదే కాకుండా ఇతర గేమింగ్ కంపెనీలపైనా పెద్దఎత్తున చర్యలు చేపడుతున్నట్లు పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
తక్కువ మొత్తంలో ట్యాక్స్ చెల్లించారంటూ డ్రీమ్11, గేమ్స్‌క్రాఫ్ట్ సహా అనేక ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీలకు ప్రభుత్వం గత నెలలో షో-కాజ్ నోటీసులు జారీ చేసింది. పన్ను ఎగవేత ఆరోపణలపై పలు గేమింగ్ కంపెనీలకు 1 లక్ష కోట్ల విలువైన నోటీసులు ఇచ్చినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ నివేదించింది. అక్టోబర్ 1 నుంచి ఇండియాలో నమోదు చేసుకున్న విదేశీ గేమింగ్ కంపెనీల డేటా ఇంకా తేల్చలేదని ఓ ప్రభుత్వాధికారి తెలిపినట్లు చెప్పింది.

దేశంలో కార్యకలాపాలు కొనసాగిస్తున్న 100 కంటే ఎక్కువ ఆన్‌లైన్ గేమింగ్ అప్లికేషన్‌లు.. దాదాపు 1 లక్ష కోట్ల మేర పన్ను ఎగవేతకు పాల్పడినట్లు ఈనెల ప్రారంభంలో వార్తలు వచ్చాయి. వీటిని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఇంటెలిజెన్స్ (DGGI) నిశితంగా గమనించిన అనంతరం షోకాజ్ నోటీసులు పంపినట్లు తెలుస్తోంది.
ఇదే కారణంతో గత వారం డెల్టా కార్ప్ 6 వేల 384 కోట్లకు సంబంధించి GST నోటీసును అందుకుంది. దీంతో కంపెనీపై ఉన్న మొత్తం పన్ను డిమాండ్ 23 వేల కోట్లకు చేరింది. 21 వేల కోట్ల GST ఎగవేత ఆరోపణలపై గతేడాది సెప్టెంబర్‌లో గేమ్స్ క్రాఫ్ట్ కి సైతం షోకాజ్ నోటీసు వెళ్లింది. ఆన్ లైన్ గేమింంగ్ సంస్థలపై GST పెంచినప్పటి నుంచి తరచుగా ఈ తరహా వార్తలు వినిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications