air vistara: ఎయిర్ విస్తారాపై కేంద్రమంత్రి ఫైర్.. Xలో రాజీవ్ చంద్రశేఖర్ పోస్ట్ వైరల్!
air vistara: విమాన ప్రయాణాల్లో పలువురికి అసౌకర్యం కలిగిన ఘటనలు చూస్తూనే ఉన్నాం. కొందరు నేరుగా ఎయిర్ లైన్స్ సేవా కేంద్రాల ద్వారా ఫిర్యాదు చేస్తారు. మరికొందరు బహిరంగంగా సోషల్ మీడయాలో పోస్ట్ చేసి త్వరితగతిన సమస్య పరిష్కారం కోసం ప్రయత్నిస్తారు. తాజాగా ఓ కేంద్ర మంత్రికి ఇలాంటి ఓ సంఘటన ఎదురైంది. అయితే ఆయన రెండో మార్గాన్ని ఎంచుకున్నారు.
కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్.. లండన్ నుంచి న్యూఢిల్లీకి విమానంలో ప్రయాణిస్తున్నారు. ఈ సమయంలో ఆయన ఓ ఫొటో తీసి తన X ఖాతాలో పోస్ట్ చేశారు. విమానం లోపల ప్రయాణీకులు నడిచే మార్గంలో చెత్తాచెదారం ఉండటంతో సదరు ఎయిర్ లైన్స్ సంస్థపై ఆయన వ్యంగ్యంగా స్పందించారు.

"గత రాత్రి లండన్ నుంచి ఢిల్లీకి @airvistaraలో ప్రయాణించాలని నిర్ణయించుకున్నాను. కొత్త 787 ఎయిర్‌క్రాఫ్ట్ చాలా స్మూత్ గా కనిపించింది. అయితే అందులో సర్వీస్ అధ్వానంగా ఉంది. క్యాబిన్ ఆహారం, చెత్తాచెదారంతో నిండి ఉంది. ఇండియాకు వచ్చే సందర్శకులను ఇలా స్వాగతించడం సరికాదు. గ్లోబల్ క్యారియర్‌లతో పోటీ పడేందుకు ఇది ఉత్తమ మార్గం కాదు. #Disappointed @TataCompanies" అని మంత్రి పోస్ట్ చేశారు.
ఈ వ్యవహారంపై ఎయిర్‌లైన్స్ కంపెనీ స్పందించి, క్షమాపణలు చెబుతూ కామెంట్ చేసింది. "ప్రియమైన సర్, మా కస్టమర్‌లకు ఉన్నత స్థాయి సేవలు అందించడానికి ప్రయత్నిస్తున్నాం. అయితే ఇది మేము ఊహించిన దానికి అనుగుణంగా లేదు. మీ ప్రయాణ అనుభవం పట్ల చింతిస్తున్నాం. దయచేసి కలిగిన అసౌకర్యానికి మా హృదయపూర్వక క్షమాపణలను అంగీకరించండి" అని అందులో పేర్కొంది.
అనంతరం ఈ వ్యవహారంపై ఎయిర్ విస్తారా వివరణ ఇచ్చింది. ఎయిర్ క్రాఫ్ట్ ల్యాండ్ అవుతున్నప్పుడు క్యాబిన్ లో కూర్చున్న చిన్నారి అనుకోకుండా ఆ చెత్తను జారవిడిచినట్లు పేర్కొంది. విమానం పూర్తిగా ఆగకపోవడంతో సిబ్బంది దాన్ని వెంటనే క్లియర్ చేయలేకపోయారని తెలిపింది. అయితే ప్రయాణీకులు దిగడానికి ముందే దాన్ని శుభ్రపరిచినట్లు అప్ డేట్ చేసింది.


Click it and Unblock the Notifications