నిన్న, మొన్నటి వరకు ప్రపంచ కర్మాగారంగా పేరొందిన చైనాపై మనం ఎక్కువగా ఆధారపడే వాళ్లం. ఆటవస్తువులు, బొమ్మల మార్కెట్ ను చూస్తే మొత్తం డ్రాగన్ మయమే. కానీ కొంత కాలంగా మోడీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇచ్చినట్లు తెలుస్తోంది. గతంలో చైనా నుంచి ఆట వస్తువులు దిగుమతి చేసుకునే భారత్.. ఇప్పుడు దేశీయంగా తయారవుతున్న బొమ్మలను విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి ఎదిగింది.
పదేళ్లలో భారీగా పెరిగిన ఎగుమతులు:
ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-డిసెంబర్ కాలంలో దేశీయ బొమ్మల ఎగుమతులు.. రూ.1,017 కోట్లకు చేరుకున్నట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఓ ట్వీట్ లో తెలిపారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. 2021-22లో మొత్తం ఎగుమతులు రూ.2,601 కోట్లకు చేరాయన్నారు. 2013-14 ఏప్రిల్-డిసెంబర్ లో రూ.167 కోట్ల ఎగుమతులు జరగ్గా.. గతేడాది ఇదే సమయానికి 6 రెట్లు పెరిగినట్లు పేర్కొన్నారు.

డెబ్బై శాతం తగ్గిన దిగుమతులు:
దేశీయంగా బొమ్మల తయారీ, ఎగుమతులను ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. నాణ్యత లేని చైనా వస్తువుల దిగుమతులను తగ్గించడానికి ప్రయత్నిస్తోంది. 2018-19లో రూ.2,960 కోట్ల విలువైన బొమ్మలు భారత్ లోకి దిగుమతి అయ్యాయి. 'వోకల్ ఫర్ లోకల్'లో భాగంగా.. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే ఆటవస్తువుల తయారీకి మోడీ సర్కారు ప్రోత్సాహం అందిస్తోంది. తద్వారా 2021-22 నాటికి దిగుమతి 70 శాతం తగ్గి రూ.870 కోట్లకు పరిమితమైంది.

దిగుమతి సుంకం పెంపు:
బొమ్మల దిగుమతులను నిరుత్సాహపరిచే లక్ష్యంతో.. ఫిబ్రవరి 2020లో దిగుమతి సుంకాన్ని ప్రభుత్వం 20 శాతం నుంచి 60 శాతానికి పెంచింది. ఈ ఏడాది దానిని 70 శాతానికి విస్తరించింది. దేశీయంగా తయారీ, ఎగుమతులను పెంచేందుకు గాను.. ఉత్పత్తి ఆధారిత ఆర్థిక ప్రోత్సాహకాలను అమలు చేస్తోంది. తయారవుతున్న ఆటవస్తువులు భారతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలంటూ 2020లో ఆదేశాలు జారీ చేసింది. భారత్ కు ఎగుమతి చేసే వాటికీ ఇది వర్తిస్తుందని పేర్కొంది.


Click it and Unblock the Notifications