rice exports: బియ్యం, గోధుమ ఎగుమతులపై కేంద్రం మంత్రి వ్యాఖ్యలు.. ఆ ప్రతిపాదన ఏమీ లేదని స్పష్టం
Ban on exports: దేశీయంగా స్వయం సమృద్ధి సాధించేందుకు, పెరిగిన ధరలను అదుపులోకి తెచ్చేందుకు వీలుగా వివిధ ఉత్పత్తుల ఎగుమతులపై కేంద్రం ఇటీవల నిషేధం విధించింది. దీంతో మనపై ఆధారపడిన పలు దేశాలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. ప్రభుత్వం మరోసారి పరిస్థితిని సమీక్షించి నిబంధనలు సడలించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై కేంద్ర మంత్రి స్పష్టత ఇచ్చారు.
గోధుమలు, బాస్మతియేతర మరియు విరిగిన బియ్యం సహా చక్కెరపై ఎగుమతుల మీద నియంత్రణలపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్పందించారు. ప్రస్తుతం వాటిని ఎత్తివేసే ప్రతిపాదన ఏమీ ప్రభుత్వం ముందు లేదని స్పష్టం చేశారు. ఇదే సమయంలో గోధుమలు, చక్కెరను దిగుమతి చేసుకునే ఆలోచనా భారత్‌కు లేదని వెల్లడించారు.

ప్రాథమిక అంచనాల ప్రకారం 114 మెట్రిక్ టన్నుల మేర దేశీయంగా గోధుమ ఉత్పత్తి ఉంటుందని ఆయన తెలిపారు. రానున్న రోజుల్లో గోధుమల ధరలు తగ్గుతాయని ప్రభుత్వం అంచనా వేస్తోందని చెప్పారు. మరోవైపు భారీగా పెరిగిన బియ్యం ధరలను తగ్గించే మార్గాలను తమ సర్కారు పర్యవేక్షిస్తోందని స్పష్టం చేశారు.
పెరుగుతున్న ధరలను నియంత్రించే చర్యల్లో భాగంగా.. మే 2022లో భారత్ గోధుమ ఎగుమతులను, జూలై 2023 నుంచి బాస్మతీయేతర బియ్యం ఎగుమతులను నిషేధించింది. అక్టోబర్ 2023 తర్వాత చక్కెర ఎగుమతులపైనా ఆంక్షలను పొడిగించింది. ఆహార భద్రత అవసరాల రీత్యా ఇండోనేషియా, సెనెగల్, గాంబియా వంటి స్నేహపూర్వక దేశాలకు మాత్రమే బియ్యం అందిస్తున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు.


Click it and Unblock the Notifications