మోడీ ప్రభుత్వ హయాంలో తీసుకున్న అతిపెద్ద నిర్ణయాల్లో వస్తు, సేవల పన్ను(GST) ఒకటి. వివిధ రకాల పన్నుల స్థానంలో 'ఒకే దేశం-ఒకే పన్ను విధానం' అంటూ ఈ పద్ధతిని వినియోగంలోకి తీసుకువచ్చారు. అనంతరం ప్రభుత్వాలు విధిస్తున్న పన్నులన్నీ వీటి కిందకే వస్తున్నాయి. కానీ దైనందిన జీవితాల్లో నిత్యవసరమైన పెట్రోల్, డీజిల్ మాత్రం GST కిందకు రాలేదనే నిరాశ ప్రజల్లో ఉంది. ఈ విషయంపై ఆర్థిక మంత్రి ఇవాళ కీలక వ్యాఖ్యలు చేశారు.

త్వరలోనే GST పరిధిలోకి:
పెట్రోలియం ఉత్పత్తులను త్వరలోనే GST పరిధిలోకి తీసుకురావచ్చని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సూచనప్రాయంగా తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇందుకు సిద్ధంగానే ఉందని ప్రకటించారు. బడ్జెట్ అనంతరం పరిశ్రమల ఛాంబర్ PHDCCI సభ్యులతో ఆమె ఇవాళ సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరిస్తే పెట్రోలియం ఉత్పత్తులను GST పరిధిలోకి తీసుకురావడానికి తమకేమీ ఇబ్బంది లేదన్నారు. కానీ ఈ విషయంలో ఏ విధంగా ముందుకెళ్తారో మాత్రం వివరించలేదు.

రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పుకుంటాయా?
పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ సైతం గత నవంబరులో ఇదే తరహా వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. 'మద్యం, ఇంధనం ద్వారా రాష్ట్రాలు పెద్ద ఎత్తున ఆదాయం పొందుతున్నాయి. అలాంటి మార్గాలను వారు ఎందుకు వదులుకుంటారు ? ద్రవ్యోల్బణం సహా ఇతర ఇబ్బందులపై కేంద్రం మాత్రమే ఆందోళన చెందుతోంది' అంటూ ఆయన వ్యంగ్యంగా స్పందించారు.

రాష్ట్రాల సహకారం కరవైంది:
దేశాభివృద్ధికి ఊతమివ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వ వ్యయాన్ని ఏటేటా కేంద్రం పెంచుకుంటూ పోతోందని సీతారామన్ గుర్తుచేశారు. తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్ లోనూ మూలధన వ్యయాన్ని 33 శాతం అంటే 10 లక్షల కోట్లకు పెంచినట్లు గుర్తుచేశారు. విద్యుత్ సహా వివిధ రంగాల్లో సంస్కరణల ద్వారా ముందుకు తీసుకువెళ్లడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. కానీ రాష్ట్రాల నుంచి ఊహించిన స్థాయిలో స్పందన రావడం లేదన్నారు. 'వన్ నేషన్-వన్ రేషన్' పథకం పలుచోట్ల అమలు కాకపోవడాన్ని ఆమె ఉదహరించారు.


Click it and Unblock the Notifications