పెట్టుబడుల ఉపసంహరణపై కేంద్రం వెనక్కు మళ్లిందా అంటే ఔననే అంటున్నాయి మార్కెట్ వర్గాలు. ఓ కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యలు అందుకు బలం చేకూరుస్తున్నాయి. ప్రభుత్వరంగ సంస్థ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(BPCL) సహా పెట్రోలియం శాఖ పరిధిలోని ఏ కంపెనీలోనూ వాటా ఉపసంహరణకు ప్రయత్నించడం లేదని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. ప్రస్తుతానికి గ్రీన్ ఎనర్జీ వైపు మారేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.

ఇప్పట్లో ఆలోచన లేదు:
BPCL లోని వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియను విరమించుకున్నట్లు మే 26 న ప్రభుత్వం తెలిపినట్లు కేంద్ర మంత్రి గుర్తు చేశారు. పునః సమీక్షించి మరోసారి ప్రారంభిస్తామని చెప్పిందన్నారు. BPCLలో వాటా ఉపసంహరణ ఆలోచన ఇప్పటికి లేదని గతంలో తెలిపిన ఇదే మంత్రి.. గత అనుభవం దృష్ట్యా మరోసారి ప్రయత్నించమని ప్రస్తుతం స్పష్టం చేసినట్లు ఓ ప్రముఖ వార్తా సంస్థ నివేదించింది.

ఆయిల్ మినహా ఇతర కంపెనీలు ఓకే..
ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థలను ప్రైవేటీకరించడం, బ్యాంకింగ్ రంగంలో సంస్కరణలను ముందుకు తీసుకువెళ్లాలనే కేంద్ర ఆర్థిక శాఖ ఉద్దేశానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. దేశంలో BPCL, IOCL, HPCL సహా ప్రైవేటు రంగంలో 77 వేల పెట్రోల్ బంకులు ఉన్నాయి. వాటిలో 22 వేలు ప్రైవేటు రంగానికి చెందినవి కాగా మిగిలినవి ప్రభుత్వ రంగానివని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల సమస్యలను పరిష్కరించడానికి మాత్రమే చూస్తున్నాం కానీ ప్రైవేటీకరణకు కాదని పేర్కొన్నారు.

అలా జరిగింది:
BPCLలోని తన మొత్తం వాటా 53 శాతాన్ని ప్రైవేట్ సంస్థలకు విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం 2021-22లో భావించింది. అందుకోసం ఓ ప్రత్యేక ప్రణాళికను రచించింది. తర్వాత నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా.. తన లక్ష్యాన్ని 2022-23కి మార్చుకుంది. చివరికి ఇప్పుడు ఆ ప్రణాళికను పూర్తిగా రద్దు చేసింది. మొదటిసారి BPCL ప్రైవేటీకరణ ప్రణాళిక సమయంలో.. వాటా కొనుగోలుకు అనిల్ అగర్వాల్ నేతృత్వంలోని వేదాంత గ్రూప్, అపోలో గ్లోబల్ మేనేజ్‌మెంట్, థింక్ గ్యాస్ ఆసక్తి చూపాయి. కానీ డీల్ కు అవసరమైన నిధులను కట్టలేకపోయారు. అనంతరం వారిలో ఇద్దరు తప్పుకున్నారు.


Click it and Unblock the Notifications