Inflation: పెరుగుతున్న ద్రవ్యోల్బణం దేశ ప్రగతికి స్పీడ్ బ్రేకర్ గా తయారైంది. నిన్న రిలీజైన ఇన్ఫ్లేషన్ డేటా సానుకూలంగా ఉండటంతో కొంత ఊపిరి పీల్చుకోవచ్చు. కానీ ఆహార ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడానికి మోదీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ప్రజలపై గుదిబండగా మారే ప్రమాదమూ లేకపోలేదని విశ్లేషణలు వెలువడుతున్నాయి.
బియ్యం, గోధుమలు, ఉల్లి ఎగుమతులపై ఇటీవల కేంద్రం నిషేధం విధించింది. ఇదే సమయంలో వాటి ధరలు ఆకాశాన్ని అంటి, సామాన్యూడు కొనలేని పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు తాజాగా ఈ లిస్టులో చేరేందుకు పప్పులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. 2015లో ఏర్పడిన పప్పు సంక్షోభం పునరావృతం కాకుండూ చూసేందుకు మోదీ ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.

పప్పు ధరల్లో ఇప్పటికే పెరుగుదల మొదలైంది. అతి త్వరలో పండుగ సీజన్ ప్రారంభం కానుండగా.. ప్రజల నుంచి వీటికి భారీగా డిమాండ్ ఏర్పడనుంది. అదే స్థాయిలో సప్లై లేకపోతే పెద్ద వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించి సొమ్ము చేసుకునే ఆస్కారం లేకపోలేదు. అదే జరిగితే, గత ఏడాది కాలంగా 45 శాతం పెరిగిన పప్పుల రేట్లు.. ఏ స్థాయికి చేరుతాయో ఊహించడం కూడా కష్టమే.
వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు గత వారం ఓ లేఖ రాసింది. తమ రాష్ట్రాల్లో అందుబాటులో ఉన్న కందిపప్పు, మినపపప్పు స్టాక్ స్టేటస్ ప్రభుత్వ పోర్టల్‌లో అందుబాటులో ఉంచేలా చూడాలని కోరింది. దీనికి తోడు ఇటీవల వీటి ధరలు 25 శాతం పెరగ్గా.. ప్రభుత్వం దిగుమతులను కూడా ప్రారంభించింది.
ద్రవ్యోల్బణం ఇప్పటికే గరిష్ట స్థాయిల్లో ఉన్నందున.. ఆహార భద్రత ఆందోళనకరంగా మారింది. కూరగాయల ధరలు భరించలేక ఇటు వినియోగదారులు, అటు రైతులూ తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఈ సమయంలో పప్పు సరఫరా నిర్వహణలో ఏవైనా తప్పులు జరిగి, ద్రవ్యోల్బణం నియంత్రణలో విఫలమైతే.. దేశంలో దాల్-రోటీని ఆహారంగా తీసుకుంటున్న సింహభాగంపై ఈ ప్రభావం నేరుగా పడుతుందని ఆందోళన వ్యక్తమవుతోంది.


Click it and Unblock the Notifications