GST Fraud: దేశంలో నకిలీ జీఎస్టీ రీఫండ్స్ మాఫియాను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతూనే ఉంది. పైగా దీనికోసం తగిన సాంకేతిక వినియోగాన్ని సిద్ధం చేసుకుంటోంది.
నకిలీ ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ క్లెయిమ్ చేసే వారిపై కఠినంగా వ్యవహరించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇకపై వ్యాపారులు జీఎస్టీ రిటర్న్ ఫారమ్‌లో సవరణలు లేదా మార్పులు చేసే సదుపాయాన్ని కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవచ్చని తెలుస్తోంది. ఈ సదుపాయాన్ని చాలా మంది వ్యాపారులు పెద్ద ఎత్తున దుర్వినియోగం చేసినట్లు కేసులు వెలుగులోకి రావటంతో కేంద్రం తన వైఖరిని మార్చుకుంది. తాజాగా జీఎస్టీలో అవకతవకలపై దర్యాప్తు సంస్థలు తెలుసుకోవటంతో చర్యలు వచ్చాయి.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ వరకు రూ.18 వేల కోట్ల విలువైన 1,700 నకిలీ టాక్స్ క్రెడిట్ కేసులను ఏజన్సీలు గుర్తించాయి. ఈ క్రమంలో 98 మంది మోసగాళ్లను అరెస్ట్ చేశారు. ఇలాంటి మోసగాళ్లను గుర్తించేందుకు అధికారులు డేటాను విశ్లేషించేందుకు నూతన సాంకేతిక టూల్స్ విరివిగా వినియోగిస్తున్నారు. జీఎస్టీ మోసాలకు పాల్పడుతున్న కొందరి కారణంగా నిజాయితీ పరులు నిజంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. గడచిన కొన్నేళ్లుగా వ్యాపారవేత్తలు ఆదాయపు పన్ను శాఖ తరహాలో జీఎస్‌టీ రిటర్న్‌లను రివైజ్ చేసి మళ్లీ ఫైల్ చేసే సదుపాయాన్ని కోరుతున్నారు.
వాస్తవానికి తప్పులను సరిదిద్దుకునేందుకు ఇచ్చిన సౌకర్యాన్ని కొందరు దుర్వినియోగం చేయటంతో కేంద్రం ఆ దిశగా అడుగులు వేయటం లేదు. ప్రస్తుతం GST రిటర్న్‌ను ఫైల్ చేసిన తర్వాత సవరించడానికి లేదా సరిదిద్దడానికి ఎటువంటి సదుపాయం లేదు. కానీ వ్యాపారవేత్తలకు ఇది కలిగించే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం GST రిటర్న్ ఫారం-1ని కొంతకాలం సవరించింది. పాత GST రిటర్న్ ఫారమ్ 3Bలో ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ క్లెయిమ్‌ను సవరించే సదుపాయాన్ని ప్రవేశపెట్టింది. అయితే ఇప్పుడు జీఎస్టీ రిటర్నులను సవరించే సదుపాయాన్ని ప్రభుత్వం త్వరలో నిలిపివేయవచ్చని చెబుతున్నారు.


Click it and Unblock the Notifications