టమోటా ధరలు ఎదుర్కొనేందుకు హ్యాకథాన్.. ఐడియా ఉంటే మీరూ చెప్పొచ్చు!
Tomato: మార్కెట్‌లో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. ఇటీవల ఉల్లి రేట్లు సామాన్యుడి జేబుకు చిల్లు పెట్టగా, ఇప్పుడు టమోటా వంతు వచ్చింది. అంతకంతకూ పెరుగుతూ పోతున్న టమోటా ధరలు ప్రజలకు ఇబ్బందిగా మారాయి. ఈ ధరాఘాతాన్ని ఎలా కంట్రోల్ చేయాలో తెలియక ప్రభుత్వం తలపట్టుకుంటోంది. ఇందుకోసం ప్రజల సహకారం తీసుకోవాలని భావించింది.
'టమోటా గ్రాండ్ ఛాలెంజ్ హ్యాకథాన్' పేరిట భారత ప్రభుత్వం న్యూఢిల్లీలో ఓ ప్రోగ్రామ్ నిర్వహిస్తోంది. పెరుగుతున్న టమోటా ధరలను ఎదుర్కునేందుకు పరిష్కారం సూచించాలని ప్రజలను కోరింది. ఈ పోటీలో విద్యార్థులు, రీసెర్చ్ స్కాలర్స్, నిపుణులు, స్టార్టప్స్, ఉపాధ్యాయులు సహా వివిధ రంగాల వారు పాల్గొనవచ్చంటూ స్వాగతం పలికింది.

పోటీదారులు టమోటా ధరల స్థిరీకరణతో పాటు నిరంతర లభ్యతకు సంబంధించిన ఆలోచనలు తెలియచేయాలని ప్రభుత్వం కోరింది. రైతులు తమ పంటకు గిట్టుబాటు ధర పొందే విధంగా చేయడంతో పాటు వినియోగదారులకు సైతం సరసమైన ధరలో అందించడమే దీని లక్షమని పేర్కొంది. విద్యా మంత్రిత్వ శాఖలోని ఇన్నోవేషన్ సెల్‌తో కలిసి వినియోగదారుల వ్యవహారాల శాఖ హ్యాకథాన్‌ను నిర్వహించింది.
గతంలోనూ ఉల్లి ధరల పెరుగుదలను నివారణకు సైతం ఇదే విధానాన్ని అనుసరించినట్లు ప్రముఖ మీడియా సంస్థ నివేదించింది. ఆ సమయంలో 13 ఆలోచనలు ప్రభుత్వానికి అందినట్లు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ తెలిపారు. ప్రతికూల వాతావరణ పరిస్థితులు, పంట నష్టం వల్ల టమోటా సరఫరా గొలుసులో తాత్కాలిక అంతరాయం ఏర్పడినట్లు చెప్పారు. దీనిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రజల నుంచి సలహాలు ఆశిస్తున్నామన్నారు.


Click it and Unblock the Notifications