Cheque Bounce: సాధారణంగా సమయానికి చెల్లింపులు చేసేందుకు బ్యాంక్ ఖాతాలో సరైన మెుత్తంలో బ్యాలెన్స్ లేకపోతే చెక్కులు బౌన్స్ అవుతుంటాయి. అలా ప్రతి సారీ బ్యాంకులు ఏకంగా రూ.700 నుంచి రూ.800 వరకు వసూలు చేస్తుంటాయి. అయితే తాజాగా వీటి రూల్స్ విషయంలో మార్పులు తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది.

చెక్ బౌన్స్ అయితే..
రాబోయే రోజుల్లో చెక్ బౌన్స్ ఉంటే.. ప్రజలు అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఇలాంటి వాటి కోసం కఠినమైన నిబంధనలను కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని యోచిస్తోంది. ఇలాంటి కేసులను సమర్థవంతంగా ఎదుర్కోవటానికి.. చెక్కు జారీ చేసిన వారి ఇతర బ్యాంక్ ఖాతాల నుంచి డబ్బును రికవరీ చేయటం, అలాంటి సందర్భాల్లో కొత్త బ్యాంక్ ఖాతాలు తెరవకుండా నిషేధించటం వంటి ఆప్షన్లను పరిశీలిస్తోంది. చెక్ బౌన్స్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా, మంత్రిత్వ శాఖ ఇటీవల ఒక ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసింది. అందులో అనేక సూచనలు వచ్చాయి.

రూల్స్ ఏమిటి?
ఇలాంటి కేసులు న్యాయ వ్యవస్థపై భారాన్ని పెంచుతాయి. అందువల్ల చట్టపరమైన ప్రక్రియకు ముందు కొన్ని చర్యలు తీసుకోవలసి ఉంటుంది. ఉదాహరణకు.. చెక్కు జారీ చేసిన వారి ఖాతాలో తగినంత డబ్బు లేకపోతే, ఆ మొత్తం అతని ఇతర ఖాతాల నుంచి తీసివేయబడుతుంది. చెక్ బౌన్స్ కేసును లోన్ డిఫాల్ట్‌గా పరిగణించడం, క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలకు ఈ సమాచారాన్ని ఇచ్చి వారి క్రెడిట్ స్కోర్ తగ్గించటం వంటి ఆప్షన్లను కేంద్రం పరిశీలిస్తున్నట్లు అంతర్గత సమాచారం. అయితే వీటిని ఆమోదించే ముందు న్యాయపరమైన అభిప్రాయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

ఇవి అమలైతే పరిస్థితి..
ఈ సూచనలను కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తే.. చెల్లింపుదారు చెక్కు అమౌంట్ చెల్లించవలసి ఉంటుంది. పైగా ఈ విషయం కోర్టు దాకా వెళ్లాల్సిన అవసరం ఉండదు. పైగా అకౌంట్లలో తగినంత డబ్బు లేనప్పటికీ.. ఉద్దేశపూర్వకంగా చెక్కులను జారీ చేసే పద్ధతిని తగ్గిస్తుందని నిపుణులు అంటున్నారు. వ్యాపార నిర్వహణ సౌలభ్యం పెరగటంతో పాటు, న్యాయ వ్యవస్థలపై భారం భారీగా తగ్గుతుందని తెలుస్తోంది.

జవాబుదారీ తనం పెంచేందుకు..
చెక్కు జారీ చేసిన వ్యక్తి ఇతర ఖాతా నుంచి మొత్తం ఆటోమెటిక్ గా తగ్గించటం కోసం ప్రామాణిక ఆపరేటింగ్ విధానం, ఇతర సూచనలను అనుసరించాలి. చెక్కు బౌన్స్ కేసును కోర్టులో దాఖలు చేయవచ్చు. జరిమానాతో కూడిన శిక్షార్హమైన నేరం కాబట్టి ఇది చెల్లించాల్సిన మెుత్తాన్ని డబుల్ చేయవచ్చు. పైగా జైలు శిక్షపడే అవకాశాలు ఉంటాయి. చెక్ బౌన్స్ విషయంలో కొన్ని రోజుల పాటు నగదు ఉపసంహరణపై తప్పనిసరి మారటోరియం వంటి చర్యలు తీసుకోవాలని, దానివల్ల చెక్కులు జారీ చేసేవారిని జవాబుదారీగా ఉంచాలని పరిశ్రమల సంఘం PHD ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఇటీవల ఆర్థిక మంత్రిత్వ శాఖను అభ్యర్థించింది.


Click it and Unblock the Notifications