Electricity: కోతలులేని నిరంతరాయ విద్యుత్ సరఫరా సాధ్యమేనని కేంద్ర విద్యుత్ మరియు నూతన, పునరుత్పాద శాఖ మంత్రి రాజ్ కుమార్ సింగ్ వెల్లడించారు. గ్రీన్ హైడ్రోజన్ ద్వారా కేవలం యూనిట్కు 6 రూపాయల ఖర్చుతోనే దీన్ని సుసాధ్యం చేయవచ్చని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు న్యూఢిల్లీలో జరిగిన నాల్గవ క్లీన్ ఎనర్జీ అంతర్జాతీయ కాన్ఫరెన్స్ అండ్ ఎగ్జిబిషన్లో పేర్కొన్నారు.
గ్యాస్, బ్యాటరీ వంటి ఇతర ఇంధనాలతో పోలిస్తే గ్రీన్ ఎనర్జీ అత్యంత చౌకగా లభిస్తుందని మంత్రి తెలిపారు. సాంప్రదాయ థర్మల్ ఎనర్జీ నుంచి పునరుత్పాదక ఇంధన వనరుల వైపు దేశాన్ని మళ్లించేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అందుకు తగిన విధంగా కొత్త పాలసీలు, నిబంధనలు తీసుకొస్తూ.. పరిశ్రమలో నూతన ఉత్తేజానికి ద్వారాలు తెరిచినట్లు వెల్లడించారు.

ఇటీవల జరిగిన G20 సమావేశంలో కూడా గ్లోబల్ బయోఫ్యూయల్స్ అలియన్స్ ఏర్పాటుకు సభ్య దేశాలు మద్ధతుగా నిలిచినట్లు ఆర్కే సింగ్ గుర్తు చేశారు. అభివృద్ధి చెందుతున్న మన ఆర్థిక వ్యవస్థకు సమాంతరంగా విద్యుత్ డిమాండ్ సైతం పెరుగుతున్నట్లు చెప్పారు. అయితే ప్రస్తుతం ఈ మొత్తం డిమాండ్లో 42 శాతం వాటా పునరుత్పాదక శక్తి వనరుల నుంచే వస్తున్నట్లు తెలిపారు.
రెన్యువల్ ఎనర్జీ 'మ్యానుఫ్యాక్చరింగ్ పవర్ హౌస్'గా దేశం మారుతోందని మంత్రి పేర్కొన్నారు. 88 వేల MW కెపాసిటీతో కూడిన ప్లాంట్లు నిర్మాణ దశలో ఉండగా.. ఏటా మరో 50 వేల MW కెపాసిటీని జోడించాలని భావిస్తున్నట్లు చెప్పారు. ఈ విభాగంలో పెట్టుబడులకు భారత్ స్వర్గధామంగా మారినట్లు తెలిపారు. నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ద్వారా 5.8 మిలియన్ టన్నుల కెపాసిటీతో భారత్ లీడింగ్ ఎక్స్ పోర్టర్‌గా నిలిచిందని CII-EY నివేదించినట్లు స్పష్టం చేశారు.


Click it and Unblock the Notifications