దేశీయ ఈ కామర్స్ సంస్థల ఏర్పాటుకు కేంద్రం అడుగులు.. రూల్స్ ఫ్రేమ్ చేసేందుకు నిపుణుల కమిటీ
కేంద్ర ప్రభుత్వం దేశీయ ఈ కామర్స్ సంస్థల ఏర్పాటుపై దృష్టి సారించింది. త్వరలోనే దేశీయ ఈ కామర్స్ సంస్థలను ఏర్పాటు చేసి వినియోగదారులకు సేవలు అందించాలని కేంద్రం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి నియమ నిబంధనలు రూపకల్పనపై దృష్టి సారించింది కేంద్రం.
అమెజాన్ అమ్మకాలను వారం రోజుల పాటు బ్యాన్ చెయ్యండి .. డిమాండ్ చేసిన సిఏఐటి .. రీజన్ ఇదే

కరోనా కారణంగా బాగా పెరిగిన ఈ కామర్స్ వ్యాపారం
కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో ప్రజలు తమకు కావాల్సిన వస్తువుల కొనుగోలు కోసం ఎక్కువగా ఈ-కామర్స్ సంస్థలనే ఆశ్రయించారు. కరోనా కాలంలో ఈ కామర్స్ సంస్థలు భారీగా వ్యాపారాన్ని నిర్వహించి బాగానే వృద్ధి చెందాయి. తమకు అవసరమైన గృహోపకరణ వస్తువులను కొనుగోలు చేయడం, ఆహార పదార్థాలను, నిత్యవసర వస్తువులను కొనుగోలు చేయడానికి ఆన్లైన్ కేంద్రంగా ఈ కామర్స్ సంస్థలనే నమ్ముకున్నారు చాలామంది ఇండియన్లు. ముఖ్యంగా అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి ఈ-కామర్స్ దిగ్గజాలు వివిధ సంస్థలతో ఒప్పందాలు చేసుకొని మరి ఆఫర్ల పేరుతో వందల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నాయి.

దేశీ వ్యాపారాన్నిఈ కామర్స్ ద్వారా ప్రోత్సహించాలని కేంద్రం నిర్ణయం ..11 మందితో నిపుణుల కమిటీ
ఈ నేపథ్యంలో దేశీయ వ్యాపారాన్ని ప్రోత్సహించాలని భావిస్తున్న కేంద్ర ప్రభుత్వం ఆన్లైన్ ప్లాట్ ఫామ్ గా వ్యాపారాలను ప్రారంభించటానికి సన్నాహాలు చేస్తోంది. త్వరలో దేశీయ ఈ-కామర్స్ సంస్థలు ఆన్లైన్లో తన వ్యాపారాన్ని నిర్వహించనున్నాయి. అందుకోసం కేంద్రం 11 మంది నిపుణులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసి ఈ కామర్స్ సంస్థల విధివిధానాలను, నియమ నిబంధనలను రూపొందించే పనిలో పడింది. ఈ కమిటీలో ప్రభుత్వ అధికారులను సైతం భాగస్వామ్యం చేసింది.

కమిటీలో వీరికి స్థానం ... అవకతవకలకు చెక్ పెట్టేలా రూల్స్
డీపీఐఐటి జాయింట్ సెక్రెటరీ అధ్యక్షతన పనిచేయనున్న ఈ కమిటీలో ఈ మార్కెట్,ఎంఎస్ఎంఈ , ఎన్పిసిఐ, నీతి ఆయోగ్, ఎన్ఎస్డిఎల్ అధికారులతో పాటుగా జాతీయ ట్రేడర్ ల సమాఖ్య, దేశి రిటైలర్ల అసోసియేషన్ నుంచి కూడా ప్రతినిధులకు చోటు కల్పించింది.
సరికొత్త విధానాలతో ఈ కామర్స్ వ్యాపారాన్ని పటిష్ట పరచడం కోసం సన్నాహాలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం, ఈ కామర్స్ బిజినెస్ లో ఉన్న అవకతవకలకు చెక్ పెట్టడానికి కొత్త నియమ నిబంధనల ద్వారా ప్రయత్నం చేస్తుంది.

ఈ కామర్స్ బిజినెస్ విషయంలో కేంద్ర నిర్ణయం దేశీయ వ్యాపారానికి ఊతం
ఇప్పటికే ఆన్లైన్ లో అమ్మకాలు, కొనుగోళ్లపై వివిధ రకాల ఫిర్యాదు అందుకుంటున్న నేపథ్యంలో కస్టమర్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా రూల్స్ ను ఫ్రేమ్ చేయనున్నారు. ఏదిఏమైనప్పటికీ కేంద్రం తాజాగా ఈ కామర్స్ బిజినెస్ విషయంలో తీసుకున్న నిర్ణయం దేశీయ వ్యాపారానికి ఊతం ఇచ్చినట్టుగా ఉంటుందని భావిస్తున్నారు. కరోనా కారణంగా వినియోగదారులు కొనుగోలు విధానం మార్పు చెందడంతో, దేశీయ వ్యాపారాన్ని ఈ కామర్స్ బిజినెస్ ద్వారా ప్రోత్సహిస్తే ఫలితం బాగా ఉంటుందని భావిస్తున్న సర్కార్ త్వరలోనే దేశీ ఈ కామర్స్ సంస్థల ఏర్పాటును చేయనుంది. అందుకోసమే వ్యూహాత్మకంగా ముందుకు వెళుతుంది.

ఆన్ లైన్ లో వ్యాపారాలను నిర్వహించే దిగ్గజ సంస్థలపై దేశీయ ట్రేడర్స్ ఫిర్యాదులు
ఇప్పటికే ఆన్లైన్ దిగ్గజ వ్యాపార సంస్థ అయిన అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి సంస్థల కారణంగా దేశీయ వ్యాపారం తీవ్రంగా దెబ్బతింటుందని, ఎలాంటి నియమ నిబంధనలు పాటించకుండా సదరు సంస్థలు వ్యాపారాన్ని చేస్తున్నాయని, తద్వారా ప్రభుత్వానికి చెల్లించాల్సిన జీఎస్టీ ని, ఆదాయ పన్ను కూడా ఎగ వేస్తున్నాయని ఇప్పటికే కాన్ఫిడరేషన్ ఆఫ్ ఇండియా ట్రేడర్స్ పలుమార్లు కేంద్ర ప్రభుత్వానికి సదరు సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.