కుమ్మక్కు ఆరోపణలపై సిమెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ తీవ్రంగా స్పందించాయి. ఇండియా సిమెంట్స్ వైస్ ప్రెసిడెంట్ అండ్ ఎండీ, సౌత్ ఇండియా సిమెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (SICMA) ప్రెసిడెంట్ ఎన్ శ్రీనివాసన్ కుమ్మక్కు ఆరోపణలను ఖండించారు. సిమెంట్ ఉత్పత్తిదారులు ఒక్కటే అధిక ధరలకు సిమెంట్ విక్రయిస్తున్నారని చెప్పడం సరికాదన్నారు. అసలు ఇక్కడ జట్టు కట్టి ఇష్టారీతిన ధరలు ఎక్కడ పెంచారని ప్రశ్నించారు. బిల్డర్స్ పైన అసహనం వ్యక్తం చేశారు.

100 శాతం మార్జిన్ ఉంచుకొని...
భవన నిర్మాణ వ్యయంలో సిమెంట్ పాత్ర స్వల్పమని, బిల్డర్స్ 100% పైగా మార్జిన్ ఉంచుకొని ఇళ్ల ధరల్ని నిర్ణయిస్తున్నారని, అదీ కాకుండా పెరిగిన ఇళ్ల ధరలకు సిమెంట్ కంపెనీలను బాధ్యులను చేయడం సరికాదన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే బిల్డర్లు ఇలా ఆరోపిస్తున్నారన్నారు. బిల్డర్స్ లాబీని అడ్డుకోవడానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీని లేఖ ద్వారా కోరారు. ప్రతి బిల్డర్ ధర విషయంలో పారదర్శకంగా ముందుకు రావడంతో పాటుగా ఇళ్ల ధరల్ని దాదాపు 50% తగ్గించాలని, అదే విధంగా చెక్కు ద్వారా లావాదేవీలు జరపకుంటే తగిన చర్యలు తీసుకోవాలన్నారు.

సిమెంట్.. ఆత్మనిర్భర్
ప్రధాని మోడీ పిలుపునిచ్చిన ఆత్మనిర్భర్ భారత్ సంపూర్ణలక్ష్యం సాధించిన వాటిలో సిమెంట్ రంగం ఒకటి అన్నారు. 500 మిలియన్ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో భారత్ రెండో స్థానంలో ఉందని గుర్తు చేశారు. 2.5 బిలియన్ టన్నులతో చైనా మొదట ఉండగా, అమెరికా 70 మిలియన్ టన్నులతో మూడో స్థానంలో ఉంది. 500 మిలియన్ టన్నుల్లో దక్షీణాది రాష్ట్రాల వాటా 200 మిలియన్ టన్నులు.

కృత్రిమ ధరలు
హౌసింగ్ రంగంలో వృద్ధి సానుకూలంగా లేకపోవడానికి ప్రధాన కారణం కృత్రిమంగా ఫ్లాట్స్, గృహాలను అధిక ధరలకు విక్రయించడం అన్నారు. చాలామంది ఏకంగా 100 శాతం మార్జిన్ ఉంచుకొని ధరలను నిర్ణయిస్తున్నారన్నారు. ఏబిటా మార్జిన్ నిర్మాణ సంస్థలకు 50 శాతం వరకు ఉన్నాయని, సిమెంట్ కంపెనీలకు 15 శాతం లోపే అన్నారు.


Click it and Unblock the Notifications