IPO News: మార్కెట్లోకి వచ్చేందుకు తహతహలాడుతున్న కంపెనీ.. ఐపీవో కోసం సెబీకి దరఖాస్తు..
IPO News: ప్రస్తుతం దేశీయ స్టాక్ మార్కెట్లు మంచి ఐపీవో బూమ్ కొనసాగిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పటికీ ఇండియన్ ఇన్వెస్టర్లు ఐపీవోలను ఆదరిస్తూనే ఉన్నారు. దీంతో చాలా కంపెనీలు తమ ఐపీవోను లాంచ్ చేసేందుకు దీనిని సరైన సమయంగా భావిస్తున్నాయి.
ఈ క్రమంలో ప్రముఖ గృహ వినియోగ ఉత్పత్తుల సంస్థ సెల్లో వరల్డ్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ.1,750 కోట్లను సమీకరించాలని చూస్తోంది. ఇందుకోసం మార్కెట్ రెగ్యులేటర్ సెబీకి ముసాయిదా పత్రాలను దాఖలు చేసింది. ఐపీవోలో షేర్లను ఆఫర్ ఫర్ సేల్ రూపంలో విక్రయించాలని కంపెనీ చూస్తోంది.

ప్రమోటర్ గ్రూప్ నుంచి ప్రదీప్ ఘిసులాల్ రాథోడ్ రూ.300 కోట్ల వరకు, పంకజ్ ఘీసులాల్ రాథోడ్ రూ.670 కోట్ల వరకు, గౌరవ్ ప్రదీప్ రాథోడ్ రూ.380 కోట్ల వరకు, సంగీత రూ.200 కోట్ల వరకు, ప్రదీప్ రాథోడ్, బబితా పంకజ్ రాథోడ్ అండ్ రుచి గౌరవ్ రాథోడ్ ద్వారా ఒక్కొక్కరికి రూ.100 కోట్లు వాటాలు విక్రయిస్తారు.
కంపెనీలో ప్రస్తుతం గౌరవ్ ప్రదీప్‌కు 25.73 శాతం వాటా కలిగి ఉండగా, పంకజ్ ఘిసులాల్‌కు 16.24 శాతం, ప్రదీప్ ఘిసులాల్‌కు 12.86 శాతం వాటా ఉంది. రాథోడ్ కుటుంబం ప్రమోట్ చేసిన సెల్లో గ్రూప్ 1967లో ముంబయిలో ప్లాస్టిక్ PVC పాదరక్షలు, గాజుల తయారీకి ఒక చిన్న కర్మాగారాన్ని నెలకొల్పడంతో ప్రస్థానాన్ని ప్రారంభించింది.
ప్రస్తుతం కంపెనీ డ్రింక్‌వేర్, ఒపాల్‌వేర్, వంటగది ఉపకరణాలను శుభ్రపరిచే ఉత్పత్తుల, బాత్రూమ్ ఉపకరణాలు, శానిటైజర్‌ల వంటి వర్గాల్లో ఉనికిని కలిగి ఉంది. మార్చి 2023 నాటికి కంపెనీకి మెుత్తం 15,841 స్టాక్ కీపింగ్ యూనిట్లు ఉన్నాయి. అలాగే దేశవ్యాప్తంగా 5 ప్రదేశాల్లో 13 ఉత్పత్తి సౌకర్యాలను కలిగి ఉంది.
FY23లో కంపెనీ రూ.1,796.70 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఇదే క్రమంలో నికర లాభం రూ.285.07 కోట్లుగా ఉంది. సంవత్సరానికి EBITDA మార్జిన్ ఏడాది క్రితం 25.71 శాతం నుండి 24.34 శాతానికి తగ్గింది. అలాగే రూ.426.64 కోట్లుగా ఉన్న నికర రుణం ఏడాదిలో రూ.304.49 కోట్లకు తగ్గింది. కంపెనీ ఐపీవోకు కోటక్ మహీంద్రా క్యాపిటల్, ICICI సెక్యూరిటీస్, JM ఫైనాన్షియల్స్, మోతీలాల్ ఓస్వాల్ సెక్యూరిటీస్ మరియు IIFL సెక్యూరిటీస్ ఇష్యూకి లీడ్ మేనేజర్లుగా ఉన్నాయి.


Click it and Unblock the Notifications