IPO News: అడుగుపెట్టగానే అప్పర్ సర్క్యూట్.. తొలిరోజే ఐపీవో తుఫాను లాభాలు..
IPO News: ఇటీవలి కాలంలో చిన్నచిన్న ఐపీవోలు కూడా ఊహించని రీతిలో మంచి లాభాలను అందిస్తున్నాయి. ఏకంగా తొలిరోజే తమ ప్రతాపం చూపిస్తూ ఇన్వెస్టర్లకు మంచి రాబడిని, విలువను తెచ్చిపెడుతున్నాయి.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది ఈరోజే మార్కెట్లోకి అడుగుపెట్టిన సెల్లెకార్ గాడ్జెట్స్ ఐపీవో గురించే. మార్కెట్లో లిస్టింగ్ సమయంలో స్టాక్ ధర రూ.92గా నమోదైంది. అరంగేట్రం చేసిన కొద్ది సేపటికే ఇన్వెస్టర్లు కొనుగోలుకు ఎగబడటంతో స్టాక్ ధర 5 శాతం అప్పర్ సర్క్యూట్ తాకి ఆశ్చర్యానికి గురిచేసింది.

ఎన్ఎస్ఈ ఎస్ఎమ్ఈ కేటగిరీలో లిస్టింగ్ అయిన స్టాక్ ఐపీవో ప్రైస్ బ్యాండ్ రూ.87-92గా ఉన్నాయి. ప్రస్తుతం స్టాక్ ధర రూ.96.60 వద్ద గరిష్ఠాన్ని నమోదు చేసింది. సెల్లెకార్ గాడ్జెట్స్ ఐపీవో 15 సెప్టెంబర్ 2023న సబ్‌స్క్రిప్షన్ కోసం తెరవబడి.. సెప్టెంబర్ 20న ముగిసింది. ఈ క్రమంలో రిటైల్ ఇన్వెస్టర్ల కోసం ఒక్కో లాటులో 1200 షేర్ల చొప్పున కంపెనీ విక్రయించింది. అంటే ఐపీవోలో పాల్గొనాలంటే పెట్టుబడిదారులు కనీసం రూ.1,10,400 పెట్టుబడిగా పెట్టాల్సి వచ్చింది. తాజా ఐపీవో ద్వారా కంపెనీ మార్కెట్ల నుంచి రూ.50.77 కోట్లను సమీకరించింది.
ఐపీవో కొనసాగిన తీరును గమనిస్తే.. ఇన్వెస్టర్ల నుంచి మంచి స్పందన రావటంతో 116 సార్లు ఓవర్ సబ్‌స్క్రైబ్ అయ్యింది. సెల్లెకార్ గాడ్జెట్స్ ఐపీవోలో రిటైల్ కోటా 124.08 రెట్లు, నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల కోటా(NII) 176.54 రెట్లు,క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల(QIB) కోటా 57.58 రెట్లు సబ్‌స్క్రిప్షన్ పొందింది. తాజా ఐపీవో పూర్తైన తర్వాత ప్రమోటర్ల వాటా కంపెనీలో 69.95 శాతం నుంచి ప్రస్తుతం 51.54 శాతానికి తగ్గింది.


Click it and Unblock the Notifications