హార్ముజ్ జలసంధిని మళ్లీ మూసేసిన ఇరాన్.. ఇజ్రాయెల్ దాడులతో సంక్షోభంలోకి కాల్పుల విరమణ ఒప్పందం..
అమెరికా - ఇరాన్ మధ్య కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం అమలులోకి వచ్చిన కేవలం ఒక్క రోజులోనే తీవ్ర సంక్షోభంలో పడింది. ఇరాన్ మద్దతు ఉన్న హిజ్బుల్లా ఉగ్రవాద సంస్థపై ఇజ్రాయెల్ లెబనాన్‌లో తన దాడులను అకస్మాత్తుగా తీవ్రతరం చేయడమే ఇందుకు ప్రధాన కారణం.
ఇజ్రాయెల్ రక్షణ దళాలు కేవలం పది నిమిషాల వ్యవధిలోనే బీరుట్, బెకా లోయ, దక్షిణ లెబనాన్‌లోని సుమారు వందకు పైగా లక్ష్యాలపై విరుచుకుపడ్డాయి. ఈ మెరుపు దాడుల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోగా, వందల సంఖ్యలో ప్రజలు గాయపడినట్లు లెబనీస్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ పరిణామం రెండు వారాల పాటు శాంతిని నెలకొల్పాలని భావించిన అమెరికా-ఇరాన్ ప్రణాళికను కుప్పకూలే అంచుకు చేర్చింది.

ఈ ఉద్రిక్తతలకు బలమైన కారణం కాల్పుల విరమణ పరిధిపై ఉన్న భిన్నమైన అవగాహన. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఈ ఒప్పందంలో లెబనాన్ భాగం కాదని స్పష్టంగా ప్రకటించారు. ఇరాన్, అమెరికా, గల్ఫ్ మిత్రదేశాల మధ్య నేరుగా ఉన్న శత్రుత్వాన్ని తగ్గించడమే ఈ ఒప్పంద ఉద్దేశమని.. లెబనాన్‌లో ఇజ్రాయెల్ చర్యలను నిలిపివేస్తామని తాము ఎప్పుడూ వాగ్దానం చేయలేదని ఆయన పేర్కొన్నారు.
దీనిపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. ఇజ్రాయెల్ ద్వారా యుద్ధాన్ని కొనసాగిస్తూ కాల్పుల విరమణ పాటించడం సాధ్యం కాదని, బంతి ఇప్పుడు అమెరికా కోర్టులోనే ఉందని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి హెచ్చరించారు. లెబనాన్‌పై దాడులకు నిరసనగా ఇరాన్ తన అత్యంత శక్తివంతమైన ఆయుధమైన హార్ముజ్ జలసంధిని మరోసారి దిగ్బంధించింది. ప్రపంచ ముడి చమురు, సహజ వాయువు రవాణాలో 20 శాతం వాటా కలిగిన ఈ మార్గం మూతపడటం అంతర్జాతీయంగా ఇంధన ధరల పెరుగుదలకు, ఆర్థిక మందగమనానికి దారి తీసే ప్రమాదం ఉంది.
ఇజ్రాయెల్ తన పంథాను సమర్థించుకుంటూ, ఉగ్రవాద ముప్పులను నిర్మూలించడమే తమ లక్ష్యమని స్పష్టం చేసింది. అక్టోబర్ 7, 2023 నాటి మారణకాండ తర్వాత హమాస్, హిజ్బుల్లా, హౌతీల నుండి ఎదురవుతున్న ముప్పులను ఎదుర్కోవడంలో తాము రాజీ పడబోమని ప్రధానమంత్రి నెతన్యాహు ప్రకటించారు. అయితే, ఇరాన్ తన దాడులను నిలిపివేసి Strait of Hormuz , ఇతర జలసంధులను తెరిస్తే, ట్రంప్ నిర్ణయానికి మద్దతు ఇస్తామని ఆయన ఒక షరతును కూడా ఉంచారు.
ఇదే సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు సైనిక సహకారం అందించే దేశాలపై 50 శాతం భారీ సుంకాలను విధిస్తున్నట్లు ప్రకటించి ఒత్తిడిని మరింత పెంచారు. ఇరాన్ యొక్క అణు సామర్థ్యాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తామని, యురేనియం సుసంపన్నతను అనుమతించబోమని ఆయన ఖచ్చితంగా చెబుతున్నారు.
ప్రస్తుతానికి అమెరికా, ఇరాన్ల మధ్య చర్చలకు పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా మారే అవకాశం కనిపిస్తోంది. జేడీ వాన్స్ నేతృత్వంలోని బృందం ఇరాన్ ప్రతినిధులతో భేటీ కావాల్సి ఉంది. కానీ, ఒకవైపు లెబనాన్‌లో ఇజ్రాయెల్ భీకర దాడులు, మరోవైపు ఇరాన్ హార్ముజ్ జలసంధి దిగ్బంధనం మరియు అమెరికా విధిస్తున్న కొత్త ఆర్థిక ఆంక్షలు ఈ శాంతి ప్రయత్నాలను క్లిష్టతరం చేస్తున్నాయి.
ఇరాన్ తన అనుచర సంస్థలైన హిజ్బుల్లాను కాపాడుకోవాలని చూస్తుండగా, ఇజ్రాయెల్ వారిని పూర్తిగా తుడిచిపెట్టాలని నిశ్చయించుకుంది. ఈ పరస్పర విరుద్ధ లక్ష్యాల మధ్య, కేవలం రెండు వారాల కాలపరిమితి గల కాల్పుల విరమణ ఒప్పందం నిలబడుతుందా లేదా అన్నది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది. దౌత్యం ద్వారా ఈ సమస్యకు ముగింపు పలకాలని అమెరికా సెనేటర్లు ఆశిస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో యుద్ధ మేఘాలు ఏమాత్రం తగ్గడంలేదు.


Click it and Unblock the Notifications