Tax Notices: ఇన్స్యూరెన్స్ కంపెనీలకు CBDT గట్టి షాక్.. మొన్న GST, ఇప్పుడు IT విభాగాల ఎటాక్
Insurance companies: నిబంధనలు కఠినతరం చేయడం సహా ట్యాక్స్ రిటర్నులను ఆదాయపు పన్ను శాఖ క్షుణ్ణంగా ఆడిట్ చేస్తోంది. ఏ చిన్న పొరపాటు చేసినా ఇట్టే పసిగట్టి నోటీసులు పంపిస్తోంది. ఇప్పటికే GST ఎగవేతకు సంబంధించి ఇన్సూరెన్స్ కంపెనీలకు DGGI నుంచి నోటీసులు అందాయి. కాగా ఇప్పుడు IT విభాగం వంతు వచ్చింది.
ఏప్రిల్ 1, 2023కి ముందు ఏజెంట్లకు అధిక కమీషన్లు చెల్లించి, మినహాయింపులను క్లెయిమ్ చేసిన వివిధ బీమా కంపెనీలకు ఆదాయపు పన్ను విభాగం దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. ఈ వ్యవహారానికి సంబంధించి మార్చి చివరి నాటికి మొత్తం 25 వేల కోట్ల విలువైన ట్యాక్స్ డిమాండ్ నోటీసులను పంపే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.

'నిర్దిష్ఠ సంవత్సరాల్లో బీమా కంపెనీలు చెల్లించిన పన్నును CBDT తిరిగి మదింపు చేస్తోంది. అవకతవకలు కలిగి ఉన్నట్లు గుర్తించిన సంస్థలకు ఆదాయపు పన్ను శాఖ పన్ను నోటీసులను పంపే ప్రక్రియలో ఉంది. మార్చి చివరి నాటికి అందజేయబడతాయి' అని ఆ అధికారి ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDAI) నిర్దేశించిన పరిమితికి మించి ఏజెంట్లు మరియు మధ్యవర్తులకు చెల్లించిన అదనపు కమీషన్‌పై ప్రస్తుతం వివాదం నెలకొంది. వీటికి తోడు కొన్ని ఇతర ఖర్చుల రూపంలో బీమా కంపెనీలు చెల్లించే అదనపు కమీషన్‌పైనా కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (CBDT) విచారణ జరుపుతోంది.
ఏప్రిల్ 1, 2023 నుంచి బీమా రంగంలో పారదర్శకతను నిర్ధారించడానికి ఏజెంట్లకు చెల్లించే కమీషన్‌లపై IRDAI పరిమితులను ఎత్తివేసింది. అయితే ఇప్పుడు IT విభాగం విచారణ జరిపేది అంతకు ముందు సంవత్సరాల్లో చెల్లించిన వాటి గురించి కావడం గమనార్హం. ఇదే తరహా వివాదంలో GST ఎగవేతకు పాల్పడ్డారంటూ బజాజ్ అలయన్జ్, ఆదిత్య బిర్లా సన్ లైఫ్ మరియు HDFC లైఫ్ ఇన్సూరెన్స్‌తో సహా 15 బీమా కంపెనీలకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జిఎస్‌టి ఇంటెలిజెన్స్ (DGGI) 2 వేల 350 కోట్ల మేర నోటీసులు పంపింది.


Click it and Unblock the Notifications