Billionaires in STs: భారత్‌లో కుల వివక్షకు వ్యతిరేకంగా అంబేడ్కర్ వంటి మహానుభావులు నడుం బిగించారు. సామాజిక వర్గాల ఆధారంగా రిజర్వేషన్లను రాజ్యాంగంలో పొందుపరిచారు. అయితే స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లు దాటినా ఇంకా కులాల కుంపట్లు కొనసాగుతూనే ఉన్నాయి. ఉన్నత వర్గాల వారు సందను పెంచుకుంటూ పోతుండగా.. ఇతరులు మాత్రం ఇప్పటికే అలాగే కొనసాగుతున్నట్లు నివేదికలు వెలువడ్డాయి.
దేశంలో ఆర్థిక అసమానతలు గణనీయంగా పెరిగినట్లు ప్రపంచ అసమానత నివేదిక వెల్లడించింది. దేశంలోని బిలియనీర్ల సంపదలో దాదాపు 90 శాతం అగ్రవర్ణాల చేతుల్లోనే కేంద్రీకృతమై ఉన్నట్లు నివేదించింది. 'ట్యాక్స్ జస్టిస్ మరియు వెల్త్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ ఇండియా' పేరిట సంపద పంపిణీపై సమస్యలను హైలెట్ చేసింది. దేశం మొత్తం సంపదలో 40 శాతం కేవలం 1 శాతం ఉన్నతవర్గాల నియంత్రణలో ఉన్నదని స్పష్టం చేసింది. ఇది పెరుగుతున్న అసమానతలను సూచిస్తోందని పేర్కొంది.

నివేదిక ప్రకారం.. ఇండియాలోని బిలియనీర్ సంపదలో 88.4 శాతం ఉన్నత వర్గాల చేతిలో ఉంది. అత్యంత అట్టడుగు వర్గాలకు చెందిన షెడ్యూల్డ్ తెగ(ST)లకు సంపన్న భారతీయులలో చోటు లేదని చెప్పి షాక్ ఇచ్చింది. ఆల్-ఇండియా డెట్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ సర్వే ప్రకారం 2018-19లో జాతీయ సంపదలో దాదాపు 55 శాతం అగ్రవర్ణాలు కలిగి ఉన్నాయి. మన కుల వ్యవస్థలో పాతుకుపోయిన లోతైన ఆర్థిక అసమానతలను ఈ వైరుధ్యం నొక్కి చెబుతున్నట్లు గుర్తు చేసింది.
విద్య, ఆరోగ్య సంరక్షణ, సోషల్ నెట్‌వర్క్‌లు మరియు సంపద సృష్టికి అవసరమైన అన్నింటినీ కులం ప్రభావితం చేస్తూనే ఉన్నట్లు తాజా నివేదికలు చెబుతున్నాయి. చరిత్రలో చూస్తే అనేక ప్రాంతాలలో దళితులకు భూమి లేకుండా నిషేధించినట్లు రిపోర్టు పేర్కొంది. తద్వారా వారి ఆర్థిక పురోగతిని తీవ్రంగా పరిమితం చేశారని వెల్లడించింది.
ఈ అసమానత కేవలం సంపద విషయంలో మాత్రమే కాదని పలు ఇతర నివేదికలు హైలెట్ చేస్తున్నాయి. అజీమ్ ప్రేమ్‌జీ యూనివర్సిటీ నిర్వహించిన 'స్టేట్ ఆఫ్ వర్కింగ్ ఇండియా, 2023' పరిశోధన కూడా షెడ్యూల్డ్ కులాలు (SCలు) మరియు షెడ్యూల్డ్ తెగలు (STలు) వివిధ ఎంటర్‌ప్రైజెస్ యజమానులుగా తక్కువ సంఖ్యలోనే ఉన్నట్లు తేల్చి చెప్పింది. శ్రామిక శక్తిలో ఎస్సీలు 19.3 శాతం ఉండగా, కేవలం 11.4 శాతం మాత్రమే సొంతంగా వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. ఇక 10.1 శాతం శ్రామిక శక్తిగా ఉన్న ఎస్టీలలో కేవలం 5.4 శాతం మాత్రమే ఎంటర్‌ప్రైజ్ యజమానులని పేర్కొంది.


Click it and Unblock the Notifications