GO First: తిరిగి విమానాలు నడిపేందుకు గోఫస్ట్‌కు డీజీసీఏ అనుమతి.. కండిషన్స్ అప్లై..
GO First: నిధుల కొరతతో వాడియా గ్రూప్ కు చెందిన బడ్జెట్ విమానయాన సంస్థ గోఫస్ట్ గ్రౌండ్ అయిన సంగతి తెలిసిందే. అసలు కంపెనీ తిరిగి కోలుకోగలదా.. దేశీయ విమానయాన చరిత్రలో అలా జరిగిన దాఖలాలు లేవంటూ అనేక అనుమానాలు చక్కర్లు కొట్టాయి.
కంపెనీ యాజమాన్యం మాత్రం తిరిగి విమానాలను నడిపేందుకు నిబద్ధతతో చేస్తున్న కృషి ఫలించింది. విమాన సేవలను తిరిగి ప్రారంభించేందుకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ గోఫస్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో దేశ చరిత్రలో తొలిసారిగా దివాలా తీసిన విమానయాన సంస్థ తిరిగి సేవలు ప్రారంభిస్తూ కొత్త చరిత్రకు నాంది పలికింది. అసాధ్యం అనుకున్నదాన్ని కంపెనీ సుసాధ్యం చేసి చూపింది.

విమానయాన రంగంలో దాదాపు 17 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం చేసిన గోఫస్ట్ నిధుల కొరతతో చిన్న బ్రేక్ తీసుకున్నప్పటికీ తిరిగి సేవలు ప్రారంభించేందుకు కొత్త ప్లాన్ తో ముందుకు వచ్చింది. అయితే కొన్ని షరతుల మేరకు దీనికి ఆమోదం లభించింది. ఢిల్లీ హైకోర్టు, ఎన్‌సిఎల్‌టిలో పెండింగ్‌లో ఉన్న రిట్ పిటిషన్ల ఫలితాలకు లోబడి జూన్ 28 నాటి ప్రతిపాదిత పునఃప్రారంభ ప్రణాళికను పరిశీలించిన తర్వాత ఆమోదం తెలిపినట్లు డీజీసీఏ శుక్రవారం నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది.
ఎయిర్ ఆపరేటర్ సర్టిఫికేట్‌ను కలిగి ఉండటానికి వర్తించే అన్ని నియంత్రణ అవసరాలకు అనుగుణంగా ఉంటే.. గో ఫస్ట్ ఫ్లైట్ ఆపరేటిన్లను తిరిగి ప్రారంభించవచ్చని DGCA తెలిపింది. జూలై 23, 2023 వరకు అన్ని విమాన సేవలను కంపెనీ రద్దు చేసినప్పటికీ.. ఫ్లీట్‌లోని 22 విమానాలతో వీలైనంత త్వరగా సేవలను పునఃప్రారంభించాలని గోఫస్ట్ భావిస్తోంది. అయితే ఎయిర్‌క్రాఫ్ట్, క్వాలిఫైడ్ పైలట్లు, క్యాబిన్ సిబ్బంది, AMEలు, ఫ్లైట్ డిస్పాచర్‌లు మొదలైన వాటి పరంగా అందుబాటులో ఉన్న వనరులకు అనుగుణంగా ప్రతిపాదిత విమాన షెడ్యూల్‌ను సమర్పించాలని DGCA సూచించింది.


Click it and Unblock the Notifications