IPO News: లిస్టింగ్ రోజే షాక్ ఇచ్చిన ఐపీవో.. అయోమయంలో ఇన్వెస్టర్లు, లోయర్ సర్క్యూట్లో లాక్..
CapitalNumbers Infotech IPO: జనవరి నెలలో దేశీయ స్టాక్ మార్కెట్లలోకి అడుగుపెట్టిన ఐపీవోల్లో చాలా వరకు పెట్టుబడిదారులకు మంచి రాబడులను అందించిన సంగతి తెలిసిందే. అయితే ఎస్ఎమ్ఈ ఐపీవోలు చాలా వరకు సూపర్ లిస్టింగ్ గెయిన్స్ అందించాయి. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా తలకిందులయ్యాయని తెలుస్తోంది.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది క్యాపిటల్ నంబర్స్ ఇన్ఫోటెక్ కంపెనీ ఐపీవో గురించే. ఎస్ఎమ్ఈ కేటగిరీలో వచ్చిన ఐపీవో బీఎస్ఈలో నేడు ఫ్లాట్ లిస్టింగ్ నమోదు చేసింది. ఇష్యూ ధర కంటే 4 శాతం ప్రీమియం ధర రూ.274 వద్ద అడుగుపెట్టిన కంపెనీ షేర్లు కొన్ని నిమిషాల్లో ఇన్వెస్టర్ల నుంచి అమ్మకాల ఒత్తిడిని చూడటంతో 5 శాతం లోయర్ సర్క్యూట్ తాకాయి. దీంతో తొలిరోజు ఇన్వెస్టర్లు లాభాలను పొందటానికి బదులుగా నష్టాలను చవిచూశారు. ప్రస్తుతం ఒక్కో షేరు ధర రూ.260.3 వద్ద మార్కెట్లో కొనసాగుతున్నాయి.

వాస్తవానికి కంపెనీ తాజా ఐపీవో ద్వారా దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి రూ.169.37 కోట్లను విజయవంతంగా సమీకరించింది. ఇందులో రూ.84.69 కోట్లకు తాజా ఈక్విటీ షేర్లను ఆఫర్ చేయగా.. మిగిలిన డబ్బును రైజ్ చేసేందుకు 32.20 లక్షల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ కింద విక్రయించింది. కంపెనీ తన ఐపీవో ఇష్యూను సాధారణ పెట్టుబడిదారుల కోసం జనవరి 20 నుంచి జనవరి 22 వరకు తెరచి ఉంది. ఈ క్రమంలో కంపెనీ తన ఐపీవో ప్రైస్ బ్యాండ్ ధరను ఒక్కో షేరుకు రూ.250-263గా నిర్ణయించిన సంగతి తెలిసిందే.
కంపెనీ తన ఐపీవో లాట్ పరిమాణాన్ని 400 షేర్లుగా నిర్ణయించటంతో పెట్టుబడిదారులు కనీసం రూ.1,05,200 పెట్టుబడిగా పెట్టాల్సి వచ్చింది. ఈ క్రమంలో కంపెనీ యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ.48.19 కోట్లను సమీకరించాలని నిర్ణయించింది. ఆఫర్ చివరి రోజున పబ్లిక్ ఆఫర్‌లో 42.77 లక్షల షేర్లకు గాను రూ.15,145 కోట్ల విలువైన 57.61 కోట్ల షేర్లకు బిడ్స్ దాఖలయ్యాయి. దీంతో ఐపీవో మెుత్తంగా 134 రెట్లు ఓవర్‌సబ్‌స్క్రిప్షన్ చేయబడింది. ఈ క్రమంలో రిటైల్ ఇన్వెస్టర్ల వాటా 72 సార్లు, నాన్ ఇన్టిట్యూషన్ ఇన్వెస్టర్ల వాటా 267 సార్లు, క్వాలిఫైడ్ ఇన్వెస్టర్ల కేటగిరీ 122 సార్లు ఓవర్ సబ్‌స్క్రిప్షన్ చూసింది.
కంపెనీ వ్యాపారం..
ఇదే క్రమంలో కంపెనీ వ్యాపారం గురించి పరిశీలిస్తే.. క్యాపిటల్ నంబర్స్ ఇన్ఫోటెక్ అనేది సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ సొల్యూషన్స్ అందించే ఐటీ ఇంజనీరింగ్, డిజిటల్ కన్సల్టింగ్ కంపెనీ. కంపెనీ తన క్లయింట్లకు ఏఐ, మెషిన్ లెర్నింగ్, డేటా అనలిటిక్స్, UI/UX డిజైన్, క్లౌడ్ ఇంజనీరింగ్, బ్లాక్‌చెయిన్ వంటి అధునాతన సాంకేతికతలకు సంబంధించిన సేవలను అందిస్తుంది. ప్రస్తుతం కంపెనీకి ప్రపంచ వ్యాప్తంగా 250 కంటే ఎక్కువ మంది క్లయింట్లు ఉన్నారు.


Click it and Unblock the Notifications